AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో టెన్షన్ టెన్షన్..

పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు. దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకోవడం సరికాదన్నారు.

MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో టెన్షన్ టెన్షన్..
Mp Avinash Reddy
Krishna S
|

Updated on: Aug 12, 2025 | 7:13 AM

Share

కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ, టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజామున నాలుగున్నర నుంచి పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ అవినాష్ ఇంటి ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అవినాష్‌ను పోలీసులు కడపకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులపై అవినాష్ మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా తనను అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు చేస్తున్నారని.. దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకుంటూన్నారని ఆరోపించారు. ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడు చూడలేదన్నారు. బయటి వాళ్లు వచ్చి పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.

అటు టీడీపీ నేతలను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 10,600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్టలో మొత్తం 13 పంచాయతీలు ఉండగా 24,600 ఓట్లు ఉన్నాయి. 11 మంది అభ్యర్థులు జెడ్పీటీసీలో బరిలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఐజీ కోయప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్ల తర్వాత పులివెందులలో కొన్ని చోట్ల దాడులు జరగడంతో ఇక్కడ 700 మందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత కోసం పోలింగ్ రూట్‌లో సీఐ స్థాయి అధికారి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐని ఏర్పాటు చేస్తున్నారు.

పులివెందులలో మొత్తం సమస్యాత్మక కేంద్రాలు కావడంతో స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు డీఐజీ కోయప్రవీణ్ వెల్లడించారు. కడప ఎస్పీ ఆధ్వర్యంలో 6 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దులో అద్దాలమర్రి బాట చెక్ పోస్టు, అనుగంపల్లె, పార్నపల్లె వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అలాగే కనంపల్లె, నల్లగొండుగారిపల్లె, రాయలాపురం, చందమామ దాబా, అలవలపాడు రోడ్డుసర్కిల్, ఎర్రపల్లి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం, మద్యం తరలించకుండా పోలీసులు నిఘా ఉంచారు. ఒంటిమిట్టలో సోమశిల అటవీ సమీప పరిధిలో ఉండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..