AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రెండు రోజుల ఏపీ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. ఆదివారం విజయవాడలో పౌర సన్మానం కార్యక్రమంలో..

Andhra Pradesh: రెండు రోజుల ఏపీ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి..
President Murmu
Amarnadh Daneti
|

Updated on: Dec 03, 2022 | 8:40 AM

Share

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. ఆదివారం విజయవాడలో పౌర సన్మానం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం విశాఖలో నేవీడే ఉత్సవాలకు హాజరవుతారు. సోమవారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆదివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఢిల్లీలో బయలుదేరి ఉదయం 10గంటల15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పోరంకి చేరుకుని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన పౌర సన్మానానికి హాజరవుతారు. అనంతరం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. సాయంత్రం విశాఖలో జరిగే నేవీడే ఉత్సవాలకు హాజరవుతారు. రక్షణ దళాల సుప్రీం కమాండర్ గా ముఖ్య అతిథిగా హాజరై, విన్యా సాలను తిలకిస్తారు. ఆదే వేదికపై నుంచి.. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం..

డిసెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యా లయం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం బయలుదేరి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన కోసం రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనలో ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అవసరమైన చర్యలను పోలీసులు చేపడుతున్నారు.

గతంలో రాష్ట్రానికి

రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. సీఎం జగన్ తన నివాసంలో ముర్ముకు తేనేటి విందు ఇచ్చారు. ఆ తరువాత జరిగిన వైసీపీ ఎంపీలు – ఎమ్మెల్యేల సమావేశంలో తనకు మద్దతు ఇవ్వాలని ముర్ము కోరారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేల సమావేశంలోనూ ముర్ము పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి హోదాలో ముర్ము రాష్ట్రానికి వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అభివృద్ధి ప్రాజెక్టులకు..

విశాఖపట్టణం వేదికగానే రాష్ట్రంలో రక్షణ రంగం, జాతీయ రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏయిర్ రేంజ్, ఎన్టీఆర్ స్వగ్రామం క్రిష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ఉన్నాయి. రాయచోటి – అంగల్లు జాతీయ రహదారి సెక్షన్ తో పాటుగా కర్నూలు నగరంలో ఆరు లేన్లుగా విస్తరించిన రోడ్లతో పాటు, మదిగుబ్బ- పుట్టపర్తి హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..