Andhra Pradesh: నో స్మోక్ జోన్‌గా ద్వారకాతిరుమల.. ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం నిషేధం..
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తర్వాత.. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ద్వారకా తిరుమల క్షేత్రం. శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ఈ ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు..
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తర్వాత.. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ద్వారకా తిరుమల క్షేత్రం. శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ఈ ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అధ్యాత్మిక కేంద్రం కావడంతో ఇక్కడికి వచ్చే భక్తులు మరింత ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తిరుమల తరహాలో ద్వారకా తిరుమల క్షేత్రంలో కూడా పొగతాగటంపై నిషేధం విధించాలని అధికారులు నిర్ణయించారు. ద్వారకాతిరుమలను స్మోక్ ఫ్రీ జోన్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దేవస్థానం కొండపైనా, కొండ కింద 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల వినియోగంపై అధికారులు నిషేధం విధించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో ఆలయ సిబ్బందికి 21 రోజులు పాటు శిక్షణ ఇవ్వనున్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపాన నిషేధ చట్టంపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా ధూమపాన నిషేధంపై భక్తుల్లో అవగాహన కల్పించడం కోసం సిబ్బందికి ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించడంతో పాటు, వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
వాస్తవానికి సిగరేటు, పొగాకు ఉత్పత్తులను నిషేధ చట్టం 2003 సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నిషేధం. ఈ నిబంధన అతిక్రమిస్తే రూ.200 వరకు జరిమానా విధించనున్నారు. అలాగే సెక్షన్ 5 ప్రకారం పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేధించారు. ఈ నిబంధన ఎవరైనా అతిక్రమిస్తే రెండేళ్ల వరకు లేదా వెయ్యి రూపాయల జరిమానా, కొన్ని సందర్భాల్లో జరిమానా, జైలు శిక్ష రెండూ కలిపి విధించనున్నారు. సెక్షన్ 6 ఏ ప్రకారం విశ్వ విద్యాలయాల పరిసరాల్లో పొగాకు నమలడం,ఉత్పత్తులను విక్రయించడంపై కూడా నిషేధం ఉంది.
సెక్షన్ 6 బి ప్రకారం 18 సంవత్సరాలలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం లేదా వారిచే అమ్మకాలు చేపట్టడం కూడా నేరమే. అయినప్పటికి కొన్ని చోట్ల యధేచ్చగా పొగాకు విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు ఆలయాలు పబ్లిక్ ప్లేస్‌లు కావడంతో ఇక్కడ బహిరంగ ధూమపానం చేయడం చట్టరీత్యా నిషేధం. దీంతో పాటు ఇక నుంచి ఆలయ పరిసరాల్లో ధూమపానం నిషేధం అమలుచేయాలని ఏలూరు జిల్లా అధికారులు నిర్ణయించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..