Andhra Pradesh: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రేస్ వే కు కేంద్రం పచ్చ జెండా.. ఆ నగరాల మధ్య నిర్మాణానికి అడుగులు..
ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రవాణా సౌకర్యాలపై దృష్టి సారించిన సెంట్రల్ సర్కార్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు లైన్ల జాతీయ రహదారిని..

ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రవాణా సౌకర్యాలపై దృష్టి సారించిన సెంట్రల్ సర్కార్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రగతి పథం కోసం కడప–రేణిగుంట మధ్య ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర రవాణా – జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ వివరాలు వెల్లడించింది. షోలాపూర్–చెన్నై ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్టార్ట్ అయిన గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా.. కడప నుంచి తిరుపతి సమీపంలోని రేణిగుంట జంక్షన్ వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తారు. రూ. 1,500.11 కోట్లతో 120 కిలో మీటర్లతో నిర్మాణానికి కేంద్రం ఆమోదం వేసింది. రెండు ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించి, 2024 నాటికి హైవేను పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ రహదారి వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలను రేణిగుంట విమానాశ్రయంతో అనుసంధానం చేస్తుంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టుల నుంచి షోలాపూర్ పారిశ్రామిక ప్రాంతానికి సరుకు రవాణా సులభతరం అవనుంది. రాయలసీమలో అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రోజూ సగటున 18 వేల వాహనాలు ప్రయాణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నాలుగు లేన్ల జాతీయ రహదారితో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందని అధికారుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. రహదారులు నిర్మిస్తున్నా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి. వాహనదారులను అప్రమత్తం చేయడం, సైన్ బోర్డులు, రోడ్ మార్కింగ్, రింబల్ స్ట్రిప్స్, ఎల్లో గ్రిడ్ మార్కింగ్, వేగ నియంత్రణ బోర్డులు వంటివి ఏర్పాటు చేయాలి.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి