Prakasam: ఏపుగా పెరిగిన మిర్చి పంట నుంచి ఎన్నడూ రాని ఘాటు వాసన.. పోలీసులు వెళ్లి చూడగా..
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో మళ్లీ అంతరపంటగా గంజాయి సాగు బయటపడింది. మిర్చి పొలాల్లో దాగుడుమూతలు ఆడిన గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు పట్టుకుని ధ్వంసం చేశారు. . దోర్నాల మండలం జమ్మి దోర్నాలలో రాజబాబు అనే రైతు మిర్చి పంట మధ్య గంజాయిని పెంచుతున్నట్టు గుర్తించడంతో అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో అత్యంత రహస్యంగా పొలాల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నారు. గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గంజాయి సాగుతో పాటు విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మద్యం ధరలు పెరిగిపోవడం, తక్కువ ధరకే లోకల్‌గా పండిస్తున్న గంజాయి దొరుకుతుండటంతో యువత గంజాయి మత్తుకు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో నెలరోజుల వ్యవధిలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇటీవల గిద్దలూరులో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తూ పటుబడ్డాడు. శ్రీశైలం ఘాట్ రోడ్డు దగ్గర మూడు రోజుల క్రితం గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పంటపొలంలో గంజాయి సాగు చేస్తున్న మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా అంతరపంటగా గంజాయి సాగు…
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాలలో రాజబాబు అనే వ్యక్తి తన మిర్చి పంటలో గుట్టు చప్పుడు కాకుండా భారీగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు… పంటలో మిర్చిని మించి ఘాటు వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులకు అంతరపంటగా గంజాయి సాగుచేస్తున్నట్టు గ్రహించి విస్తుపోయారు. వెంటనే విషయాన్ని మార్కాపురం ఎక్సైజ్ అధికారులకు చేరవేశారు. మిర్చి పొలం దగ్గరకు వెళ్లి పరిశీలించిన ఎక్సైజ్ అధికారులకు షాక్ తగిలింది. మిర్చిలో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించారు..వెంటనే గంజాయి మొక్కలను పీకేసి అక్కడే తగులబెట్టారు. రహస్యంగా నిషేధిత గంజాయి మొక్కల సాగు చేస్తున్న బోయపాటి రాజబాబును అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసారు.. రాజబాబులా ఎవరైనా అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ వెంకట రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం పంటల మాటున అంతర పంటగా గంజాయి సాగు చేస్తునే ఉంటారన్నది బహిరంగ రహస్యమే. కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. అయితే దీనిపై ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో అధికారులు గుర్తించలేకపోతున్నారు… తాజాగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ అధికారులు పట్టుకోగలిగారు. అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న జమ్మి దోర్నాల, పెద్ద బొమ్మలాపురం, మర్రిపాలెం, చిలకచర్ల గ్రామాల పరిధిలో గంజాయి మొక్క లను మిర్చి, కంది పంటల మాటున పెంచడం ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయింది.

Ganja
