Andhra Pradesh: శవం డోర్ డెలివరీ కేసులో కొత్త మలుపు.. గుప్త నిధుల కోసం నరబలి కోణంలో విచారణ
నెల్లూరుజిల్లా ఉదయగిరిలో చనిపోయిన ఉప్పు శ్రీను మృతి వెనుక మిస్టరీని ఛేధించేందుకు ప్రకాశం, నెల్లూరుజిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. స్వామీజీని విచారించిన నేపధ్యంలో పలు ఆశక్తికరమైన ఆంశాలు వెలుగులోకి వచ్చాయని భావిస్తున్నారు.
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో 35 ఏళ్ళ ఉప్పు శ్రీను అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన ఘటన కొత్తమలుపు తిరిగింది.. గుప్తనిధుల కోసం నరబలి ఇచ్చారా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. శ్రీను మృతి వెనుక గుప్తనిధుల వేటగాళ్ళ హస్తం ఉందని తేలడంతో గుప్తనిధుల కోసం శ్రీనును నరబలి ఇచ్చారా.. లేక ప్రమాదవశాత్తూ చనిపోయాడా అన్నది మిస్టరీగా మారింది.. నెల్లూరుజిల్లా ఉదయగిరి కొండల్లో గుప్తనిధుల వేటగాళ్ళు చేపట్టిన తవ్వకాల్లో శ్రీను అనుమానాస్పదంగా చనిపోవడం, అతడి శవాన్ని మూటగట్టి తీసుకొచ్చి ప్రకాశంజిల్లాలోని అతని ఇంటి ముందు పడవేసిన ఘటనలో నెల్లూరు, ప్రకాశంజిల్లాల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నెల్లూరుజిల్లా ఉదయగిరి కొండపై గుప్తనిధుల కోసం వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31వ తేదీన ఉదయగిరి కొండపై చిన్నమసీదు ప్రాంతంలో గుప్తనిధుల ముఠా సభ్యులు తవ్వకాలు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనును కూలి పనుల పేరుతో తీసుకెళ్ళి కొందరు తవ్వకాలు జరిపినట్టు అనుమానిస్తున్నారు… ఆ సమయంలో బ్లాస్టింగ్ చేయడంతో శ్రీను తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడని భావించినా దీని వెనుక నరబలి కోణం ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరోవైపు ముఠా సభ్యులు మృతదేహాన్ని మూటలో కట్టి కారులో స్వగ్రామానికి తీసుకెళ్లి ఈనెల 1వ తేదీ అర్ధరాత్రి మృతుడి ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. 2వ తేది ఉదయం ఇంటి ముందు ఉన్న మూటను మృతుడి కుటుంబసభ్యులు విప్పి చూడగా శ్రీను మృతదేహం కనిపించింది.. వెంటనే బందువులు ప్రకాశంజిల్లా పుల్లెలచెరువు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాపులో భాగంగా శనివారం పెద్దారవీడు, పుల్లలచెరువు ఎస్‌ఐలు, సిబ్బంది తవ్వకాలు చేపట్టిన ఉదయగిరి కొండ దగ్గరకు చేరుకొన్నారు.. నెల్లూరుజిల్లా ఉదయగిరి పోలీసుల సహకారంతో ముమ్మర విచారణ చేపట్టారు.
ఉదయగిరి కొండపై కొన్నేళ్లుగా గుప్త నిధుల తవ్వకాల కోసం అక్రమార్కుల దారుణాల పర్వం కొనసాగుతూ ఉంది. ఒకప్పటి రాయలేలిన ఈ గడ్డ అంతకముందు నవాబులు పరిపాలించిన కోట ఉదయగిరి రాజధానిగా చేసుకుని విజయనగరం వరకు రాజ్యాన్ని పరిపాలించిన ఆనవాళ్లు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి.. ఈ క్రమంలో నాటి రాజుల కాలంలో నేల మాళీగలు, భోషాణాలు అనేకం ఈ కొండ కింద ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వందల కొద్ది దేవాలయాలు.. అంతే స్థాయిలో మసీదులు.. వాటి మాటున రాజులు, నవాబులు దాచిన గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారంతో గుప్తనిధుల వేటగాళ్ళ కన్ను ఈ ప్రాంతంపై పడింది.. ఇప్పటికే ఉదయగిరి కొండను కొల్లగొట్టి పసిడి సంపదను దోచుకెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కొల్లగొట్టిన గుప్త నిధులతో బయట ప్రాంతాలకు వెళ్లి దానిని నగదుగా మార్చుకొని కోట్లకు పడగలెత్తారన్న అనుమానాలు ఉన్నాయి.. దీంతో ఉదయగిరి కొండపై తాజాగా గుప్త నిదుల కోసం వేటగాళ్ళు తవ్వకాలు జరిపారు.
మృతుడు శ్రీను వారం రోజుల క్రితం పనుల నిమిత్తం ఊరు విడిచి వెళ్ళాడు.. పనులు పూర్తి చేసుకుని శ్రీను ఇంటికి వస్తాడను కుంటే అతడి శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీలా ఇంటిముందు పడేసి వెళ్ళారు.. మృతదేహం పక్కనే 35 వేలు మట్టి ఖర్చుల కోసమంటూ లెటర్ రాసి పెట్టి వెళ్ళిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో కలకలం రేపింది… ఉప్పు శ్రీను అనే వ్యక్తి రెండేళ్ళ నుండి భార్యకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పనుల కొరకు వేరే ప్రాంతానికి వెళుతున్నానని తల్లిదండ్రులైన లింగాలు, వెంకటరత్నం కు చెప్పి వెళ్ళాడు.. తీరా వంటిపై గాయాలతో శవమై ఇంటి ముందు పడి తల్లిదండ్రులకు దర్శన మిచ్చాడు. మృతుని తల్లి వెంకటరత్నం మాట్లాడుతూ, పక్కింటి వారు చెప్పే వరకు మా ఇంటిముందు కొడుకు శవం ఉందని తమకు తెలియదని, పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి ఇలా శవమై వచ్చాడని ఆవేదనగా తెలిపింది..
ఎర్రగొండపాలెం సిఐ మారుతి కృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు… అర్ధరాత్రి వచ్చిన సమాచారంతో ముటుకులకు వెళ్ళామని శ్రీను శవం దుప్పట్లో చుట్టి పడేసి ఉందని సిఐ తెలిపారు… తండ్రి లింగాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి సమాచారం తెలుపుతామన్నారు.. కూలిపనుల కోసం వెళ్ళిన కొడుకు శవాన్ని డోర్ డెలివరీ చేయడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.. తమ కొడుకు మృతిపై పోలీసులు పూర్తి వివరాలు రాబట్టాలని కోరుతున్నారు.
నెల్లూరుజిల్లా ఉదయగిరిలో చనిపోయిన ఉప్పు శ్రీను మృతి వెనుక మిస్టరీని ఛేధించేందుకు ప్రకాశం, నెల్లూరుజిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. స్వామీజీని విచారించిన నేపధ్యంలో పలు ఆశక్తికరమైన ఆంశాలు వెలుగులోకి వచ్చాయని భావిస్తున్నారు.. విచారణ పూర్తయితే ఉప్పు శ్రీను మృతి వెనుక నరబలి కోణం ఉందా.. లేదా.. అన్నది తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..