AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీసర్స్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేస్‌.. గుంటూరు కార్పొరేషన్‌లో పొలిటికల్‌ కాక!

పరిపాలన అనే బండికి.. అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల లాంటివారు. ఈ రెండువర్గాలు సమన్వయంతో పనిచేస్తేనే.. పాలన సక్రమంగా సాగుతుంది. అయితే, ఏపీలోని ఆ కీలక నగరంలో వాళ్లు, వీళ్లు కలిసి రచ్చచేసేస్తున్నారట. పరస్పరం ఆరోపణలు, విమర్శలతో రోడ్డెక్కుతున్నారు. కలిసి కట్టుగా పనిచేయాల్సిన వాళ్లే.. ఇలా దుమ్మెత్తిపోసుకుంటుంటే నగరం అభివృద్ధికి దూరమైపోతోదనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.

ఆఫీసర్స్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేస్‌.. గుంటూరు కార్పొరేషన్‌లో పొలిటికల్‌ కాక!
Guntur Municipal Corporation
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 25, 2025 | 8:25 PM

Share

పరిపాలన అనే బండికి.. అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల లాంటివారు. ఈ రెండువర్గాలు సమన్వయంతో పనిచేస్తేనే.. పాలన సక్రమంగా సాగుతుంది. అయితే, ఏపీలోని ఆ కీలక నగరంలో వాళ్లు, వీళ్లు కలిసి రచ్చచేసేస్తున్నారట. పరస్పరం ఆరోపణలు, విమర్శలతో రోడ్డెక్కుతున్నారు. కలిసి కట్టుగా పనిచేయాల్సిన వాళ్లే.. ఇలా దుమ్మెత్తిపోసుకుంటుంటే నగరం అభివృద్ధికి దూరమైపోతోదనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతోంది?

గుంటూరు మిర్చీ ఎంత ఘాటో.. అక్కడి రాజకీయాలు కూడా అంతే రచ్చరేపుతాయి. ఒకరకంగా చెప్పాలంటే.. గుంటూరు ప్రస్తావన లేకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలను ప్రస్తావించలేం. ఈ నగర పరిధిలో మూడు నియోజకవర్గాలున్నాయి. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమతో పాడు పత్తిపాడు నియోజకవర్గంలోని కొంత భాగం.. గుంటూరు నగర పరిధిలోకే వస్తుంది. ఇక, కీలకమైన గుంటూరు కార్పోరేషన్ పరిధిలో పరిపాలనంతా కమీషనర్, మేయర్ చేతుల్లోనే ఉంటాయి. అయితే, ఈ పాలనా ప్రక్రియలో పాలకులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం… పొలిటికల్‌ దుమారం తప్పదు. ఇప్పుడీ నగర పరిధిలో అదే జరుగుతోంది.

గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్ పులి శ్రీనివాస్‌కు.. లోకల్‌ అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులకు.. కమిషనర్‌కు మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్న కమిషనర్‌పై గుస్సామీదున్నారట అధికార పార్టీ నేతలు. ఈ వ్యవహారాన్ని కొద్దికాలం సహించిన నేతలు.. ఇక ఊరుకునే ప్రసక్తే లేదంటుండటం… రాజకీయంగా రచ్చరేపుతోంది. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తాము అడిగిన ప్రశ్నలకు… సమాధానం కావాలని పట్టుబడుతుండటం దుమారానికి కారణమైంది . పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కమీషనర్ పులి శ్రీనివాస్ మధ్య కౌన్సిల్ హాల్లోనే మాటల యుద్దం జరిగిందట.

స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఇలా ఏ అంశంలోనూ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. మూడు నెలల క్రితం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో స్ట్రీట్ వెండింగ్ జోన్స్‌పై గల్లా మాధవి, కమిషనర్ శ్రీనివాస్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టడుతున్నారంటూ కార్పోరేషన్ అధికారులను మాధవి నిలదీశారు. పూర్తిస్థాయిలో వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయకుండా.. చిరు వ్యాపారులను ఇబ్బంది పెడితే ఎలాగని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్‌ శ్రీనివాస్‌ కూడా గట్టిగానే బదులిచ్చారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నామనీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని ఎమ్మెల్యేకు కౌంటర్‌ ఇచ్చారు.

ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు వ్యాపారులకు సరైన సమాచారం ఇవ్వకుండా.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది ఎమ్మెల్యేల ఆరోపణ. దీనికారణంగా, బాధితులు వచ్చి తమ కార్యాలయాల దగ్గర ఆందోళనకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే విషయమై కమిషనర్‌ను నిలదీశారు ఎమ్మెల్యే మాధవి. ఆ తర్వాత జరిగిన ప్రత్యేక సమావేశంలో కూడా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో తీవ్రం జాప్యం చేస్తున్నారనీ.. దీంతో అభివృద్ధి ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయనీ… ఎమ్మెల్యే మండిపడ్డారట. 100 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతుంటే.. కనీసం రెండు కోట్ల రూపాయల బిల్లులు కూడా క్లియర్‌ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. మాధవికి మరో ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు కూడా వంత పాడాటంతో.. రచ్చ మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యేలు. దీనిపై వివరణ ఇచ్చిన కమిషనర్‌… ఎవరో చెప్పిన మాటలు విని, ఇక్కడ మాట్లాడొద్దంటూ.. కాస్త ఘాటుగానే స్పందించారట. ఇబ్బడిముబ్బడిగా ప్రజా ప్రతినిధులు వర్క్స్‌ని శాంక్షన్స్ తీసుకుంటారనీ.. అయితే కాంట్రాక్టర్లు ఇరవై ముప్పై పనులు తీసుకొని సరైన సమయంలో పూర్తిచేయడం లేదని వారి దృష్టికి తీసుకొచ్చారట.

కమిషనర్‌ వ్యాఖ్యలు ఎమ్మెల్యేలకు మరింత కోపం తెప్పించింది. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తమకేంటంటూ.. పులి శ్రీనివాస్‌పై విరుచుకుపడ్డారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల, పనులు ఆగిపోతున్నాయనీ… ఎమ్మెల్యేలం కాబట్టి, ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారన్నారనీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపో మాపో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని .. తమ ఇబ్బందుల్ని ఏకరువు పెట్టారు. ఇలా ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పొలిటికల్‌గా పెద్ద రచ్చే అయ్యింది. కార్పొరేషన్‌లో సమావేశం అంటేనే సై అంటే సై అన్నట్టుగా మారింది పరిస్థితి. ప్రతిపక్షంతో పనిలేకుండా.. అధికార పక్షంలోనే అటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేలు కస్సుబుస్సులాడుకుండటం కలకలం సృష్టిస్తోంది. కలిసి పనిచేయాల్సిన వర్గాలు… ఇలా పరస్పరం తిట్టిపోసుకుంటుంటే.. అభివృద్ధి పనులెలా ముందుకెళ్తాయన్న ప్రశ్న స్థానిక ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా కయ్యాలు మాని… ఎమ్మెల్యేలు, అధికారులు.. కార్పోరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..