AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారం మారితే కేసుల కథ మారుతుందా? అప్పుడలా.. ఇప్పుడిలా..!

ప్రభుత్వం మారితే కేసుల దిశ కూడా మారుతుందా? 2019 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పులతో నమోదైన రాజకీయ కేసులు, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రభుత్వాల వాదనలు, చట్టం పాత్ర ఏంటి? కేసులు నిజంగా న్యాయ ప్రక్రియలో భాగమా? లేక రాజకీయ వ్యూహమా?

అధికారం మారితే కేసుల కథ మారుతుందా? అప్పుడలా.. ఇప్పుడిలా..!
Ap
Siva Nagaraju
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 6:53 PM

Share

అధికారం మారుతుంది. ఆరోపణలు మారడం లేదు. అధికారంలో ఉన్నవారికి చట్టం కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నవారికి కక్ష కనిపిస్తుంది. “ప్రభుత్వం మారితే.. ఎఫ్‌ఐఆర్‌ల దిశ కూడా మారుతుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ కక్ష అంటారు. అధికారంలోకి రాగానే చట్టం తన పని చేస్తోందంటారు. మరి నిజం ఏంటి?”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఆరేళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం ఒకటే. రాజకీయ కక్ష కేసులు. ప్రభుత్వం ఏ పార్టీదైనా ప్రతిపక్షం మాత్రం ఒకటే ఆరోపణ చేస్తోంది. తమపై రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని. అందుకే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ముందుకొస్తోంది. కేసులు నిజంగా చట్ట ప్రక్రియలో భాగమా? లేక రాజకీయ ఆయుధమా?

ప్రభుత్వం మారింది.. కేసుల దిశ మారిందా?

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై వరుసగా కేసులు నమోదయ్యాయి. అధికార పార్టీ మాత్రం అవన్నీ చట్టపరమైన చర్యలేనని చెప్పింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ కక్షతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాయి.

కేసుల లెక్కలు..

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం… 2019 నుంచి 2024 మధ్య టీడీపీ నేతలపై 591 కేసులు నమోదయ్యాయి. 162 మంది అరెస్టయ్యారు. జనసేన నేతలపై 24 కేసులు, బీజేపీ నేతలపై 16 కేసులు, కాంగ్రెస్ నేతలపై 12 కేసులు. నమోదయ్యాయి.

ఎవరున్నారు..

ఈ కాలంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, చింతమనేని ప్రభాకర్, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పి.నారాయణ, రఘురామకృష్ణరాజు తదితరులు వివిధ కేసుల్లో వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు, బీజేపీకి చెందిన సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలపైనా పలు సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో అరెస్టులు జరిగాయి… మరికొన్నింటిలో కోర్టులు స్టే ఇచ్చాయి… ఇంకొన్ని కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి.

అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఒకే మాట చెప్పింది. చట్టం ముందు అందరూ సమానమే. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా కేసులు తప్పవు. ఇది రాజకీయ కక్ష కాదు..చట్ట ప్రక్రియ మాత్రమే అని ప్రస్తావించింది.

2024లో మారిన ప్రభుత్వం.. మారని ఆరోపణలు

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. కానీ ఆరోపణలు మాత్రం మళ్లీ అవే వినిపిస్తున్నాయి. తమపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేస్తున్నారని ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా నమోదైన కేసులు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, విడదల రజిని, సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతాడ రవికుమార్‌తో పాటు పలువురు నేతలు వివిధ కేసుల్లో వార్తల్లో నిలిచారు.

ఏ అంశాలపై కేసులు..

హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అక్రమ మైనింగ్, భూకబ్జా, అధికారుల విధులకు ఆటంకం, సోషల్ మీడియా పోస్టులు, ఎన్నికల హింస, నిరసనల కేసులు చాలానే నమోదయ్యాయి. కొందరు అరెస్టయ్యారు. ఇంకొందరు రిమాండ్‌కు వెళ్లారు. మరికొందరికి బెయిల్ వచ్చింది. చాలా కేసులు ప్రస్తుతం దర్యాప్తు లేదా కోర్టుల విచారణలో ఉన్నాయి. సోషల్ మీడియాపైనా చర్యలు వేగం పుంజుకున్నాయి. వైసీపీ ఆరోపణల ప్రకారం… 2024 నవంబర్‌లో ఒకే వారంలో 680 నోటీసులు, 147 కేసులు, 49 అరెస్టులు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం కూడా తన వైఖరిని స్పష్టంగా చెబుతోంది. అసత్య ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, చట్టవ్యతిరేక చర్యలు, బెదిరింపులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయ కక్ష కాదు… చట్టం తన పని తాను చేస్తోంది.” అని ప్రభుత్వం చెబుతోంది.

రెండు ప్రభుత్వాలు.. ఒకే వాదన

2019లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ…”రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారు” అన్నాయి. 2024లో ప్రతిపక్షంలోకి వెళ్లిన వైసీపీ “రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారు” అంటోంది. కానీ అధికారంలో ఉన్న రెండు ప్రభుత్వాలు చెప్పిన మాట మాత్రం దాదాపు ఒకటే…”మేము చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాం.” ప్రతి ప్రభుత్వం మారినప్పుడూ ఎందుకు ప్రతిపక్ష నేతలపైనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి? హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు, సోషల్ మీడియా కేసులు, ఎన్నికల హింస కేసులు, ర్యాలీలు, నిరసనలపై కేసులు ఉన్నాయి. ఇవి నిజంగా చట్ట అమలులో భాగమా? లేక రాజకీయ ఒత్తిడి సృష్టించే వ్యూహమా అనేది ప్రశ్నగా ఉంది. ప్రజాస్వామ్యంలో కేసు నమోదు చేస్తేనే నేరం నిరూపితమైనట్లు కాదు. అలాగే కేసు రాజకీయ కక్షతో పెట్టారనే ఆరోపణ కూడా స్వయంగా నిజమైపోదు. ప్రతి కేసులో వాస్తవాలు, సాక్ష్యాలు, దర్యాప్తు, చివరికి కోర్టుల తీర్పే నిర్ణయాత్మకంగా ఉంటోంది.

ముగింపు

ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆరోపణలు మాత్రం మారడం లేదు. పార్టీల స్థానాలు మారుతున్నాయి. కానీ ‘రాజకీయ కక్ష’ అనే మాట మాత్రం ప్రతిపక్షం నోట్లోనే వినిపిస్తోంది. రాజకీయాల్లో ఆరోపణలు వెంటనే వస్తాయి… కానీ నిజాలు మాత్రం కోర్టుల్లో, దర్యాప్తుల్లో, కాల పరీక్షలోనే తేలుతాయి.

కొండవీటి శివనాగరాజు

టీవీ9 డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్

Follow Us