Mastan Sai: ఓరి మస్తాన్ సాయి.. ఇన్ని కథలు పడ్డావా.. మాములోడు కాదు
ఒకే ఒక్కడు.. ఎన్నో కేసులు.. ఇంకెన్నో అరాచకాలు. డ్రగ్స్ నుంచి.. అమ్మాయిలపై వేధింపుల వరకు. అతడు చేయని క్రైమ్ లేదు. ఓ అమ్మాయిని హోటల్ గదిలో బంధించి డ్రగ్స్ ఎక్కించి అత్యాచారం చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. తెలంగాణ, ఏపీలో వరుస కేసులతో సంచలనంగా మారిన మస్తాన్ సాయి చిట్టా ఇది. గచ్చిబౌలి డ్రగ్స్ వ్యవహారాన్ని కూపీ లాగితే.. గుంటూరు వరకు కదిలిన ఆ డొంక మిస్టరీ మామూలుగా లేదు. ఇంతకీ ఇతగాడి కహానీ ఏంటి? ఆ అరాచకాలేంటి?
గచ్చిబౌలి డ్రగ్స్‌కేసు.. మల్టీ యూనివర్స్ మూవీలా.. అటు క్రైమ్.. ఇటు లవ్ యాంగిల్‌తో రకరకాల రూట్లలో వెళ్తోంది. రాజ్‌తరుణ్, లావణ్య లవ్ స్టోరీ కేసుని కీన్‌గా అబ్జర్వ్ చేసిన పోలీసులు ఇందులో డ్రగ్స్ అనేదే ప్రధాన కోణమని అంచనా వేశారు. అదే కోణంలో డిగ్ చేస్తూ వెళ్తే మస్తాన్ సాయి లీలలు ఒక్కోటిగా వెలుగులోకి వచ్చాయి. గతేడాదే బయటపడ్డ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ బాగోతంలో ఈ మస్తాన్‌సాయి నిందితుడిగా ఉన్నాడు. కాని అతడిని కేవలం డ్రగ్స్ వినియోగదారుడిగా అంచనా వేసిన పోలీసులు అప్పుడు విచారణ జరిపి వదిలేశారు. ఇక్కడివరకు మస్తాన్ బతికిపోయాడు.
కాని.. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. తప్పు చేసిన వాడు ఎంతో కాలం తప్పించుకోని తిరగడు. ఆ సమయమే ఆసన్నమైంది. రాజ్‌తరుణ్ లావణ్య ఎపిసోడ్‌లో జరిగిన ఓ కీలక పరిణామంతో మస్తాన్‌సాయి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. డ్రగ్స్ తీసుకుని తనను మస్తాన్ సాయి వేధించాడంటూ.. గతేడాదే లావణ్య కేసు పెట్టింది. దీంతో అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే.. రెండు నెలల క్రితం విజయవాడలో నమోదైన కేసు ఇంకో ఎత్తు. గుంటూరుకు చెందిన యనమల గోపీచంద్ ఢిల్లీ వెళ్లి 35 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి వస్తూ విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా జూన్ 3న APSEB పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కోసం రైల్వేస్టేషన్ బయట కారులో ఎదురుచూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్ల కాంతికిరణ్, సుభాని హోటల్ యజమాని కొడుకులు షేక్ ఖాజా మొయిద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని సెబ్ పోలీసులు విచారించారు. రావి సాయి మస్తాన్‌రావు అలియాస్.. మస్తాన్ సాయి ఇచ్చిన చిరునామాతో గోపీచంద్ ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్లు అంగీకరించారు. దీంతో విజయవాడ పోలీసులు ఏ5గా సాయి పేరును చేర్చారు. ఇటు లావణ్య కేసు.. అటు డ్రగ్స్ కేసు.. మెడకు చుట్టుకోవడంతో సాయి పరార్ అయ్యాడు. అతడి కోసం ఇటు హైదరాబాద్ పోలీసులు.. అటు విజయవాడ పోలీసులు కలిసి గాలింపు చేపట్టారు. ఫైనల్‌గా గుంటూరు జీటీ రోడ్డులోని మస్తాన్‌దర్గా వద్ద ఉన్నాడని తెలుసుకుని విజయవాడ వెస్ట్ సెబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అతడిని అరెస్టు చేశారు. విజయవాడలోని 6వ ఎంఎం కోర్టులో హాజరుపర్చడంతో సాయికి 14 రోజుల రిమాండ్ విధించారు.
నిజానికి మస్తాన్ సాయి బి.టెక్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అతడి రూటు మార్చింది. ఇక గుంటూరులోని జిటి లో నివసించే మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహనరావు ప్రముఖ మస్తానయ్య దర్గాకు ధర్మకర్తగా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా కొంతకాలంగా గుంటూరులోనే ఉండి దర్గా నిర్వహణలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య 2023 మార్చి 30న మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం గుంటూరు వచ్చింది. అయితే మస్తాన్ సాయి పెళ్లికి తీసుకెళ్లకుండా హోటల్ ఉన్న లావణ్యపై దాడి చేశారు. తనను అత్యాచారం కూడా చేసినట్లు లావణ్య గుంటూరులోని పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేసింది. కాని అప్పుడు తన పలుకుబడితో.. అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. ఈ వివాదం అప్పట్లో గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు చూశారని.. ఎప్పుడైతే లావణ్య ప్రేమ వివాదం తెరపైకి వచ్చిందో.. మస్తాన్ సాయి పేరును బయట పెట్టాడు రాజ్‌తరుణ్. లావణ్యకు మస్తాన్ సాయే డ్రగ్స్ పంపిణి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు అతడి అరెస్టుతో టాలీవుడ్ షేక్ అవుతోంది. సీజ్ చేసిన ఫోన్‌లో ఎన్నో సీక్రెట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కొడుకు అరెస్టు అక్రమం అంటున్నారు రావి రామ్మోహన్ రావు. మస్తాన్ సాయి ఏ పాపం ఎరుగడంటున్నారు.
ఇంతకీ మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశాడు. ఎక్కడ నుండి కొనుగోలు చేశాడు. వీరి వెనుక ఇంకా ఎవరున్నారు. అన్న కోణంలో విజయవాడ సెబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద డ్రగ్స్ కేసులో అరెస్టులు గుంటూరులో కలకలం రేపుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..