చిన్నారిని కారులో మరచిపోయి దైవ దర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ?
ఏడాదిన్నర వయసున్న చిన్నారిని పొరబాటున కారులోనే మరచిపోయి.. తల్లిదండ్రులు ఇద్దరూ వేర్వేరుగా దర్శనానికి వెళ్లారు. అయితే కారులో నిద్రపోతున్న చిన్నారి డోర్లు అన్నీ మూసి, లాక్ వేసి ఉండటంతో ఊపిరి ఆడక కాసేపటికే లేచి ఏడ్వటం ప్రారంభించింది. గమనించిన స్థానికులు ఆలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం..

నంద్యాల, ఆగస్ట్ 18: కారులో భార్య, కుమార్తెతో మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ వ్యక్తి చేసిన పొరబాటుకు అధికారులంతా ఉరుకులు పరుగులు తీశారు. ఏడాదిన్నర వయసున్న చిన్నారిని పొరబాటున కారులోనే మరచిపోయి.. దంపతులు ఇద్దరూ వేర్వేరుగా దర్శనానికి వెళ్లారు. అయితే కారులో నిద్రపోతున్న చిన్నారి డోర్లు అన్నీ మూసి, లాక్ వేసి ఉండటంతో ఊపిరి ఆడక కాసేపటికే లేచి ఏడ్వటం ప్రారంభించింది. గమనించిన స్థానికులు ఆలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన ఆదివారం (ఆగస్ట్ 17) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి, భార్య పిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం (ఆగస్ట్ 17) కారులో మహానంది క్షేత్రానికి వెళ్లారు. అక్కడ దైవదర్శనం కోసం వెళ్తూ.. తమ వాహనాన్ని పార్కింగ్‌లో నిలిపారు. అప్పటికే ఏడాదిన్నర వయసున్న తమ చిన్నారి నిద్రిస్తోంది. దీంతో చిన్నారిని భర్త తీసుకొస్తాడని భార్య.. తన భార్య తీసుకెళ్లిందనుకొని భర్త ఇద్దరూ వేర్వేరుగా ఎవరిపాటికి వారు దైవ దర్శనానికి వెళ్లిపోయారు. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో చిన్నారి కారులోనే ఉండిపోయింది. కారు అద్దాలన్నీ మూసి, డోర్‌లన్నీ లాక్ పడిపోవడంతో కారులోపల ఉన్న చిన్నారికి ఊపిరాడక, చెమటలు పట్టాయి. దీంతో నిద్రలేచి ఒక్కసారిగా ఏడుపు లంకించుకుంది.
కారులో చిన్నారి ఏడుపు విన్న స్థానికులు.. వెంటనే దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. సమాచార కేంద్రంలోని రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాగార్జునరెడ్డి వెంటనే కానిస్టేబుల్ చంద్రశేఖర్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన అక్కడికి చేరుకుని రాయితో కారు అద్దాలు పగులగొట్టి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. అప్పటికే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న చిన్నారికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. దేవాలయంలోని మైకుల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించగా.. 15 నిమిషాల తర్వాత తల్లిదండ్రులు అక్కడికి వచ్చి చిన్నారిని తీసుకెళ్లారు. చిన్నారిని చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








