AP DSC 2025 Scam: స్పోర్ట్స్ కోటాలో Mega DSC ఉద్యోగాలు.. ‘సెటిల్‌మెంట్’ పేరిట జోరుగా మామూళ్లు వసూలు!
Mega DSC 2025 Sports Quota Recruiting Scams and Fraud: డీఎస్సీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన మెరిట్ జాబితా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. శాప్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ.. మీరు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేశారు కదా? ఈ ఉద్యోగం వస్తే లైఫ్ టైం సెటిల్‌మెంట్

అమరావతి, ఆగస్ట్ 19: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎస్సీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన మెరిట్ జాబితా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. శాప్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ.. మీరు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేశారు కదా? ఈ ఉద్యోగం వస్తే లైఫ్ టైం సెటిల్‌మెంట్ అవుతుంది. ఆ తర్వాత జీవితాంతం ప్రశాంతంగా గడిపేయొచ్చు. అయితే ఫైనల్ లిస్టులో మీ పేరు ఉండాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ తర్వాత మీ ఇష్టం.. అంటూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
దీంతో ఇవి నకిలీవో.. అసలువో తెలియక కొందరు అభ్యర్ధులు ఉద్యోగం వస్తుందన్న ఆశతో వీరి ఫోన్ కాల్స్‌కి తదనుగుణంగా స్పందిస్తున్నారు. విద్యాశాఖలో తమకు పలుకుబడి ఉందని, డబ్బులిస్తే.. అంతా చక్కబెట్టేస్తామని ఫోన్‌లోని వ్యక్తులు చెబుతుండటంతో అభ్యర్ధులు వారు అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.10 లక్షల నుంచి15 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు అభ్యర్ధులు ఉద్యోగం వస్తుందనే ఆశతో వీరితో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. మరికొందరు ఉద్యోగాల పేరిట మామూళ్ల వసూళ్లపై శాప్‌కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు వచ్చిన ఫోన్ కాల్స్ తాలూకూ ఆడియో, వీడియో రికార్డుల్ని సైతం పంపిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. డీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల ఫోన్ నంబర్లు థర్డ్ పార్టీకి ఎలా చిక్కాయన్నది ప్రతి ఒక్కరినీ తొలిచేస్తున్న ప్రశ్న. స్పోర్ట్స్ కోటాలోని అభ్యర్ధులందరి వివరాలు శాప్‌లోని ఓ విభాగంలో మాత్రమే ఉంటాయి. ఆయా క్రీడాసంఘాల వద్ద కూడా వీరి సమాచారం ఉంటుంది. శాప్‌లోని కొందరు అధికారులు, బయట ఉన్న కొన్ని సంఘాల ప్రతినిధులు కుమ్మక్కై అభ్యర్థుల ఫోన్ నంబర్లను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్ధులు విజ్ఞప్తులు చేస్తున్నారు. కాగా మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 421 పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా సంబంధిత ఆటల్లో ప్రతిభ ఆధారంగానే శాప్ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక జాబితా వెల్లడిచేయగా.. ఆగస్టు 19న తుది జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలనకు పంపనున్నారు. అనంతరం తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




