TDP: పొలిటికల్ టర్న్ తీసుకున్న పయ్యావుల సెక్యూరిటీ అంశం.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
Payyavula Keshav: టీడీపీ సీనియర్‌నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు... ఏపీ సర్కార్ భద్రతను ఉపసంహరించిందన్న ప్రచారం దుమారం రేపింది. ఆయనకు భద్రతగా ఉన్న గన్‌మెన్లు వెళ్లిపోవడంతో... రాజకీయంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
టీడీపీ సీనియర్ నేత పయ్యావుల సెక్యూరిటీ అంశం… ఏపీ పాలిటిక్స్‌లో రచ్చరేపింది. ఆయనకున్న ఇద్దరు గన్‌మెన్లు వెళ్లిపోవడంతో.. ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుందనే ప్రచారం జరిగింది. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించడంతో… రాజకీయ దుమారానికి దారి తీసింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే .. ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిందంటూ టీడీపీ దుమ్మెత్తిపోసింది. అనవసర రాద్ధాంతమంటూ టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్లే ఇచ్చింది వైసీపీ. అయితే, పయ్యావులకు భద్రతను ఉపసంహరిచారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు పోలీసులు. పాత గన్‌మెన్లను కొత్త సిబ్బందితో రిప్లేస్ చేయడం వల్లే.. ఈ ప్రచారం జరిగి ఉండొచ్చన్నారు.
PAC చైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్‌కు.. వన్ ప్లస్ వన్ భద్రత ఉండేది. అయితే, తనకు మరింత సెక్యూరిటీని పెంచాలని ఇటీవలె ప్రభుత్వానికి లేఖ రాశారు కేశవ్. సెక్యూరిటీని పెంచడం అటుంచి.. ఉన్న గన్‌మెన్లు కూడా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, ప్రభుత్వం కక్ష గట్టిందనీ… కేశవ్‌కు… ఇప్పటికే ఉన్న భద్రతను కూడా తొలగించిందనీ ప్రచారం జరిగింది. దీంతో, అలర్టయిన పోలీసు అధికారులు .. మళ్లీ గన్‌మెన్లు పంపడంతో వివాదం సద్దుమణిగింది.
సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో చేరేందుకు వచ్చినా… పయ్యావుల మాత్రం తొలుత వారిని యాక్సెప్ట్ చేయలేదు. తనకు ఎలాంటి భద్రతా అవసరం లేదంటూ.. వెనక్కి పంపించేశారు. అయితే, అధికారులు వివరణ ఇవ్వడంతో… చివరకు భద్రతా సిబ్బందిని అనుమతించారు. ప్రజాప్రతినిధులకు కేటాయించే గన్ మెన్లను ప్రతి మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయడం ఆనవాయితీ అనీ… అందుకే, ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్లను మార్చారే తప్ప భద్రతను తొలగించలేదని స్పష్టంచేసింది.