TTD: అవసరాలు, ఆలయాల అభివృద్ధి కోసం నిధులు.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..
ఇంతకుముందెన్నడూ జరగనివిధంగా కన్నుల పండుగగా వేడుకలు జరపాలని భావిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సెప్టెంబర్ 27నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 1న గరుడసేవ, 5న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. ఇంతకుముందెన్నడూ జరగనివిధంగా కన్నుల పండుగగా వేడుకలు జరపాలని భావిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సెప్టెంబర్ 27నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 1న గరుడసేవ, 5న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణతోపాటు పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది పాలక మండలి. ఎస్వీ గోశాల పశుగ్రాసం కొనుగోలుకు 7.32కోట్లు, అమరావతి శ్రీవారి ఆలయ సుందరీకరణకు 2.90కోట్లు, తిరుమలలో ఆక్టోపస్ బిల్డింగ్ నిర్మాణానికి 7కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో నూతన పార్వేట మండపం నిర్మాణానికి ఆమోదం తెలిపింది టీటీడీ. అలాగే తిరుమలలోని బేడి ఆంజనేయస్వామికి బంగారు కవచాలు, శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేయించనున్నారు. లడ్డూ బూందీ తయారీకి ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ టెక్నాలజీని వినియోగించనున్నారు. సింఘానియా ట్రస్ట్ ద్వారా టీటీడీ పాఠశాలలో మరింత నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, 12 రకాల సేంద్రీయ ఉత్పత్తుల కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం చేసుకోనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.
మొత్తం 75 అంశాలను అజెండాగా తీసుకున్నప్పటికీ, వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపైనే మెయిన్‌గా చర్చ జరిగింది. ఈ ఏడాది కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలను జరపాలని నిర్ణయించారు. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయనుంది టీటీడీ.