AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ongole Politics: ఒంగోలులో సుబ్బారావు గుప్తా కేసులో మరో ట్విస్ట్.. దాడికి పాల్పడ్డ వైసీపీ నేత సుభాని అరెస్ట్!

ఒంగోలులో మొదలై, గుంటూరులో కంటిన్యూ అయి, ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చగా మారింది సుబ్బారావు గుప్తాపై దాడి. ఈ కేసులో మరో మలుపు వెలుగులోకి వచ్చింది.

Ongole Politics: ఒంగోలులో సుబ్బారావు గుప్తా కేసులో మరో ట్విస్ట్.. దాడికి పాల్పడ్డ వైసీపీ నేత సుభాని అరెస్ట్!
Subhani On Subbarao Gupta
Balaraju Goud
|

Updated on: Dec 22, 2021 | 3:13 PM

Share

Ongole Politics: ఒంగోలులో మొదలై, గుంటూరులో కంటిన్యూ అయి, ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చగా మారింది సుబ్బారావు గుప్తాపై దాడి. ఈ కేసులో మరో మలుపు వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం ఏపీలో తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. గుప్తాపై దాడి చేసిన వైసీపీ నేత సుభానిని పోలీసులు అరెస్టు చేశారు.

మంత్రి బాలినేని బర్త్‌డే వేడుకల్లో కాస్త రెచ్చిపోయాడు ఓ కార్యకర్త. ఆ తర్వాత ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించాడు సుబ్బారావు గుప్తా. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నాని తీరుతో వైసీపీకి నష్టమని సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సుబ్బారావు కన్పించకుండా పోయాడు. గుంటూరులోని లాడ్జీలో ఉన్న సుబ్బారావుపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. గుప్తా చేసిన వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభాని సోమవారం నాడు దాడికి దిగారు.

అలా ఎలా మాట్లాడావంటూ గుంటూరు హోటల్‌లో అతన్ని కొట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టి సారీ చెప్పించారు వైసీపీ నేత సుభానీ. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. సుభానిపై మొన్న కేసు నమోదైంది.. నిన్న అరెస్ట్‌ చేశారు. డిసెంబర్ 12న మంత్రి బాలినేని పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేదికపై మాట్లాడిన సుబ్బారావు గుప్తా.. నీ పక్కనున్నోళ్లనే కార్యకర్తలు, నాయకులు అనుకుంటున్నావు. నిజమైన వాళ్లనూ గుర్తించు వాసన్నా.. అంటూ నేరుగా మంత్రి బాలినేనిని ఉద్దేశించి కామెంట్స్‌ చేశాడు. అంతేనా, మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపైనా నోరుపారేసుకున్నాడు గుప్తా. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రెచ్చిపోయిన సుభానీ, మంత్రి దగ్గర పరపతి పెంచుకునేందుకు సుబ్బారావు గుప్తాపై దాడి చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి బాలినేని వివరణ ఇచ్చుకునే వరకు వెళ్లింది.

కాగా, ఈ ఇష్యూని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి బాలినేని. తాను ఎవరినైనా ఇబ్బంది పెట్టానని నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకునేందుకు సిద్ధమని సవాల్‌ చేశారాయన. మరోవైపు సుబ్బారావు గుప్తా మంగళవారం నాడు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. మంగళవారం నాడు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సుబ్బారావు గుప్తా ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. కేక్ ను మంత్రికి సుబ్బారావు తినిపించారు. సుబ్బారావుకు మంత్రి కేక్ తినిపించారు. ఒంగోలు నుండి కొందరు వైసీపీ నేతలు మంగళవారం ఉదయం విజయవాడకు సుబ్బారావు గుప్తాను తీసుకెళ్లారు. తనపై దాడి వివరాలను సుబ్బారావు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వివరించారు. ఆ తర్వాత సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సుబ్బారావు గుప్తా మీడియాతో మాట్లాడారు. సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ వలనే ఈ రచ్చకు కారణమని సుబ్బారావు చెప్పారు. తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట వున్నానని గుర్తు చేసుకొన్నారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశానన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేరన్నారు. పార్టీని బతికించుకోవాలనే ఆకాంక్షతో ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనపై దాడి చేయించారనే వార్తలను సుబ్బారావు గుప్తా ఖండించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు వైసీపీ నేత సుభానిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు.

Read Also… Cheating: ఘరానా మోసగాడు.. కోర్టు స్టేలతో తప్పించుకుంటూ కోటీశ్వరుడిగా మారాడు.. చివరికి..