Andhra: బాలికలపై ఎక్కడపడితే అక్కడ చేతులేస్తున్నాడు.. ఏంటి సార్ ఇది అని అడిగితే..
రాజాం మునిసిపాలిటీ పరిధిలోని డోలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు దూసి ఆశియ్యపై ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా, డీఈవో ఆదేశాలతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అయితే కేసు నమోదైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయనగరం జిల్లా రాజాం మునిసిపాలిటీ పరిధిలోని డోలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దూసి ఆశియ్యపై రాజాం పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినుల పట్ల అతను కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాలికల శరీరంపై అసభ్యకరంగా చేతులు వేస్తూ, వారు ప్రతిఘటిస్తే.. కొడుతూ, మోకాళ్ల దండ వేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడట. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. అలా ఈ నెల 8వ తేదీన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడి ప్రవర్తనపై పెద్దఎత్తున స్కూల్‌కి చేరుకొని ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. మీడియా ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. డీఈవో మాణిక్యంనాయుడు ఆదేశాల మేరకు రాజాం ఎంఈవోలు ప్రవీణ్ కుమార్, దుర్గారావు డోలపేట జడ్పీ హైస్కూల్‌లో విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినుల నుంచి, పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరించి అదే రోజు డీఈవోకు నివేదిక సమర్పించారు. ఎంఈవోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడు దూసి ఆశియ్యను తక్షణమే సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పోలీసు శాఖ కూడా కేసును సీరియస్‌గా తీసుకుంది. రాజాం పోలీసులు ఉపాధ్యాయుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ నెల 8వ తేదీ రాత్రే కేసు నమోదు అయినప్పటికీ పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి కేసు నమోదైనప్పటికీ మీడియాకు అధికారిక సమాచారం ఇవ్వలేదు. శుక్రవారం రాత్రి ఈ అంశంపై సీఐ అశోక్ కుమార్‌ను వివరణ కోరగా, ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఈ ఘటన తీవ్ర ఆందోళనకు కారణమవుతుండగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
