అంగరంగ వైభవంగా సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల హాజరు
ఏపీలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. వేద మంత్రాలు, సాయి నామస్మరణతో భక్తి వాతావరణం నెలకొంది. 31.8 అడుగుల వెండి రథంపై 9.2 కిలోల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఏపీలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. వేద మంత్రాలు, సాయి నామస్మరణతో భక్తి వాతావరణం నెలకొంది. 31.8 అడుగుల వెండి రథంపై 9.2 కిలోల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం మహాసమాధి దగ్గర 11వందల జంటలు కలిసి సత్యనారాయణ వ్రతం నిర్వహించారు.
ఇక ఇవాళ బుధవారం (నవంబర్ 19) సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖుల రాకతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 23న బాబా అధికారిక జయంతి జరుపుకుంటారు. ఆ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది భక్తులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు.
ఉదయం 9.30 గంటలకు సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 10.15 కి సత్యసాయి సమాధి దర్శించుకుని, 10.30 నుంచి సత్య సాయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ, మధ్యాహ్నం 12.30గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి బయల్దేరి కోయంబత్తూర్ వెళ్లనున్నారు.
అయితే ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది సత్యసాయి ట్రస్ట్. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సత్యసాయి బొమ్మ ఉన్న 100 రూపాయల నాణెం, నాలుగు సత్యసాయి పోస్టల్ స్టాంపులు ఆవిష్కరించనున్నారు. కాగా ప్రధాని మోదీ పేద రైతులకు గుజరాతీ ఆవులను ఉచితంగా అందజేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో 3 వేల మంది పోలీసులతో కట్టు దిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. 300కు పైగా సీసీ కెమెరాలు, పదుల సంఖ్యలో డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా పెట్టినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




