Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటి.. అంటూ చిన్నప్పుడు మనం దొంగ - పోలీస్ ఆట ఆడుకున్నాం కదా. స్నేహితులు దాక్కుంటే వాళ్లు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. సరిగ్గా ఇలానే ఏలూరులోని ఒక పోలీసు స్టేషన్‌లో జరిగింది.

AP News: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే
Representative Image
B Ravi Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2024 | 8:07 AM

Share

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటి.. అంటూ చిన్నప్పుడు మనం దొంగ – పోలీస్ ఆట ఆడుకున్నాం కదా. స్నేహితులు దాక్కుంటే వాళ్లు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. సరిగ్గా ఇలానే ఏలూరులోని ఒక పోలీసు స్టేషన్‌లో జరిగింది. స్టేషన్‌లో నిందితుడు పోలీసులతో దొంగా పోలీస్ ఆట ఆడాడు. స్టేషన్‌కి తీసుకుని వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎవరి పనుల్లో వారు ఉన్న సిబ్బంది ఆలస్యంగా గుర్తించి అతడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఊరంతా గాలించారు, స్నేహితులు, బంధువులు అందరినీ విచారించారు. అతను కనిపించకుండా పోతే అదెక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని టెన్షన్ పడ్డారు. ఫైనల్‌గా అతను స్టేషన్‌లోనే ఉండటంతో హమ్మయ్యా.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ పోలీసు స్టేషన్‌లో ఏం జరిగింది. పోలీసుతోనే దాగుడుమూతలు ఆడిన అతగాడు ఎవరు?

వనమాటి సుబ్రహ్మణ్యం ఏలూరు అమీనాపేటలోని అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగి. అతడిపై చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. వాయిదాలకు గైర్హాజరు కావటంతో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు గురువారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తీసుకుని వచ్చారు. సుబ్రమణ్యంను అక్కడ కూర్చోమని చెప్పి ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. తీరా నిందితుడుని కోర్టులో హాజరు పరిచేందుకు రెడీ అవుతున్న సమయంలో అతడు కనిపించలేదు.

ఎవరికి వాళ్లు ఇక్కడే ఉండాలి.. ఎక్కడికి పోయాడంటూ తలలు పట్టుకున్నారు. స్టేషన్‌లో అన్ని గదులు, లాకప్ రూమ్‌లు చెక్ చేశారు. ఊరంతా వాకబు చేసి, పలువురిని అతడి జాడ కోసం విచారించారు. ఎక్కడా కాన రాకపోవటంతో పోలీసు బుర్రలకు పదును పెట్టారు. స్టేషన్ బిల్డింగ్ పైకి ఎక్కి చూడటంతో అక్కడ పిట్టగోడ ఓరగా నక్కి కూర్చున్న సుబ్రహ్మణ్యం కనిపించాడు. దీంతో అప్పటిదాకా పడ్డ టెన్షన్ నుంచి రిలీఫ్‌గా ఫీలయ్యారు. ఎందుకిలా చేశావ్ అంటే..! తప్పించుకోవటానికి ఒక పోలీసు సార్ ఇచ్చిన సలహా అని సుబ్రమణ్యం చెప్పటంతో ఇంటి దొంగపై క్రమశిక్షణా చర్యలకు రెడీ అవుతున్నారు ఉన్నతాధికారులు. ఇవండీ పోలీసుల కష్టాలు, నిందితుడిని గుర్తించాలి, పట్టుకోవాలి, జాగ్రత్తగా కోర్టుకు హాజరు పరిచి.. అక్కడ రిమాండ్ విధిస్తే జైలుకు తరలించాలి. ఈ ప్రక్రియలో చాలాసార్లు నిందితులు, రిమాండ్ ఖైదీలు తప్పించుకోవటం గతంలో జరిగాయి. కాని స్టేషన్‌లో మాయం అయి.. స్టేషన్‌లోనే దొరకటం అంటే.. ఇదో వెరైటీ ఇన్సిడెంట్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..