Pawan Kalyan: కొణిదెల గ్రామానికి నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొణిదెల గ్రామానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని నేరవేర్చుకున్నారు. ఇటీవల ఆ గ్రామ అభివృద్ధి కోసం రూ.50లక్షలు ప్రకటించిన ఆయన తాజాగా అందుకు సంబంధించిన చెక్కును నంద్యాల జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కొణిదెల గ్రామాభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని సూచించారు.

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో ఈ కొణిదెల అనే గ్రామం ఉంది. జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తుండగా కొణిదెల గ్రామం గురించి పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి కావడం జరిగింది.
ఈ క్రమంలో ఇటీవల ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామానికి ఫారం ఫాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చారు. కార్యక్రమం పూర్తవుతుండగా నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య తన మనసులోని మాటను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని ఆయన సమక్షంలోనే గుర్తు చేశారు. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని అదే సభలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. తన వ్యక్తిగత నిధుల నుంచి రూ. 50 లక్షలు గ్రామానికి ఇస్తానని అక్కడే ప్రకటించారు.
అయితే, మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50లక్షల చెక్కును అందజేసి తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. స్వయంగా ఆయనే నంద్యాల జిల్లా కలెక్టర్కు రూ.50లక్షల చెక్కును అందజేశారు. ఆ తర్వాత కలెక్టర్ రాజకుమారి ఆ చెక్కును సంబంధిత అధికారులకు అందించారు. గ్రామస్తుల కోరిక మేరకు నూతన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును నిర్మించాలని, రోడ్లు డ్రైనేజీ ఇతరత్రా వాటిని నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇచ్చిన హామీని మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50లక్షలు కేటాయించడంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంటి పేరుకు కొణిదెల గ్రామానికి ఎలాంటి సంబంధం లేదని, యాదృచ్ఛికంగానే రెండింటికి ఇప్పుడు ప్రచారం వచ్చిందని గ్రామానికి చెందిన పలువురు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..