ఒంగోలులో సీఎం వైయస్ జగన్ పర్యటనకు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి దూరంగా ఉన్నారు. నగరంలో ఇళ్ళు లేని 21 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసేందుకు సీఎం వైయస్ జగన్ ఒంగోలుకు వచ్చారు. ఆయేన పర్యటనలో ఎంపీ మాగుంటకు ఆహ్వానం ఆందలేదు. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ వైసిపి ఇన్‌చార్జి చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులుతో పాటు ఇతర వైసిపి ఎమ్మెల్యేలు కూడా సీఎం సభలో పాల్గొన్నారు. మాగుంటకు ఈసారి వైసిపి టికెట్ లేదని అధిష్టానం తేల్చి చెప్పిన నేపధ్యంలో ఆయనకు ఆహ్వానం అందకపోవడం వైసిపిలో చర్చ నడుస్తోంది. కనీసం సీఎం పర్యటనలోనైనా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందుతుందని భావించారు మాగుంట. అయితే అధికారుల నుంచి నిన్న రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో మాగుంట ఒంగోలుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పర్యటనకు మాగుంట దూరంగా ఉండిపోయారు.
దాదాపుగా రెండు నెలల క్రితమే వైసిపి సిట్టింగ్ ఎంపి మాగుంటకు తిరిగి టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆయనకు సీటు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని నెలరోజులపాటు అధిష్టానంతో పోరాటం చేశారు. అయితే సీఎం వైయస్ జగన్ స్వయంగా బాలినేనితో మాట్లాడిన తరువాత బాలినేని మెత్తపడ్డారు. ఈ పరిస్థితుల్లో మాగుంట టీడీపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఒకవైపు వైసీపీలో టికెట్ లేకపోవడం, మరోవైపు టిడిపితో మాగుంట టచ్‌లో ఉన్నారన్న ప్రచారంతో ఒంగోలులో జరిగిన సీఎం పర్యటనకు స్థానిక సిట్టింగ్ ఎంపి మాగుంటకు ఆహ్వానం అందలేదని భావిస్తున్నారు.
ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగానే అధికారులు కూడా ప్రోటోకాల్‌ను కూడా పక్కన పెట్టి ఎంపి మాగుంటకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. సీఎం ఒంగోలు పర్యటనకు ఆహ్వానం అందని నేపధ్యంలో ఎంపి మాగుంట టిడిపిలో లేదా, బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టిడిపి – జనసే కూటమిలో బిజెపి చేరితే జాతీయ పార్టీగా ఉన్న బిజెపి నుంచి ఒంగోలు ఎంపిగా మాగుంట పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అనుచరులు సూచిస్తున్నారట. ఒకవేళ టిడిపి – జనసే కూటమిలో బిజెపి లేకపోతే టిడిపి నుంచే ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసేందుకు మాగుంట సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఏదిఏమైనా ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీ మారే విషయం స్పష్టమైందంటున్నారు. ఈసారి టిడిపి లేదా బిజెపి నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..