YSRCP: ఏపీలో అధికార పార్టీ ఆపరేషన్ బీసీ.. వైసీపీకి బీసీలు వెన్నుముకగా మారేనా?
ఎన్నికల వేళ మరోసారి ఏపీలో కులరాజకీయాలు జోరందుకున్నాయి. మెజార్టీ వర్గాలైన బీసీలకు దగ్గరయ్యేందుకు అధికార, విపక్షాలు తమదైన వ్యూహాలతో వస్తున్నాయి. బీసీ హక్కులు కాపాడేందుకు రక్షణ చట్టం తీసుకొస్తామని టీడీపీ అంటే.. ఐదేళ్లలో పథకాలతో పాటు రాజ్యధికారంలో భాగస్వామ్యం ఇచ్చామంటోంది అధికారపార్టీ వైసీపీ. ఇంతకీ బీసీలు ఎన్నికల్లో ఏ పార్టీకి వెన్నుముకగా మారనున్నారు?
ఒకరిది జయహో బీసీ నినాదం… మరొకరిది బీసీసాధికారికత విధానం.! రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రధానపార్టీలు వైసీపీ, టీడీపీలు రంగంలో దిగాయి. ఇప్పటికే జయహో బీసీ అంటూ ప్రతిపక్ష టీడీపీ సభలు పెట్టి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కూడా ఇస్తామంటోంది. కఠిన చట్టాలు తీసుకొచ్చి మరీ వారికి రక్షణ కల్పిస్తామంటోంది. ధీటుగా వైసీపీ కూడా ఆపరేషన్ బీసీలో భాగంగా సభలు, సమావేశాలతో వారికి చేరువ అవుతోంది. ఇటీవల విజయవాడలో 139 బీసీ కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన సిద్ధం సభల్లో కూడా బీసీ వర్గాలే అత్యధికంగా హాజరయ్యారంటోంది వైసీపీ.
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్‌బోన్ అంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. వెనకబడ్డ కులాలకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో సగం వారికే దక్కుతున్నాయన్నారు సీఎం జగన్. ఒకప్పుడు తమ హక్కులపై నిలదీస్తే తోకలు కత్తిరిస్తామన్న చరిత్ర టీడీపీకి ఉంటే.. పదవుల్లో పెద్దపీట వేసి ఆచరణలో చూపించిన ఘనత తమకే దక్కుతుందన్నారు సీఎం.
ఇటీవల వైసీపీ పలు జిల్లాల్లో ప్రకటించిన అభ్యర్ధుల విషయంలోనూ బీసీలకు ప్రాధాన్యతనిస్తోంది. అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్ధులను మార్చి మరీ వెనకబడ్డ వర్గాలకు కేటాయించడం ద్వారా ఓటుబ్యాంకు సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. మరి ఆపరేషన్ బీసీ చేపట్టిన వైసీపీకి బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ బ్యాక్ బోన్‌గా ఉంటారా? ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చూద్దాం…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..