Andhra Pradesh: నాణ్యతే ముఖ్యం.. విద్యాకానుక కిట్లపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్న విద్యా కానుక కిట్లను మరింత నాణ్యతతో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్న విద్యా కానుక కిట్లను మరింత నాణ్యతతో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. రూ.1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి పైగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లను అందించనున్నారు. ప్లెయిన్ యూనిఫామ్ కాకుండా.. చెక్స్ ఉండే రంగులతో కూడిన క్లాత్ అందించనున్నారు. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ముద్రణ పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పంపిణీ మొదలవుతుంది. స్కూళ్లు తెరిచే రోజే వీటిని విద్యార్థులకు అందించనున్నారు.
విద్యా కానుక ద్వారా అందించే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. స్థానిక మార్కెట్లో సుమారు రూ.650 విలువ చేసే నాణ్యమైన బ్యాగులను సరఫరా చేస్తున్నారు. యూనిఫామ్‌కి సంబంధించి బాలికల టాప్, బాలుర షర్ట్‌లను ప్లెయిన్ క్లాత్ నుంచి చెక్స్ (గడులు) రూపంలోకి మార్పు చేశారు. బూట్లు మరింత షైనింగ్ ఉండేలా చర్యలు చేపట్టారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌కి గతంలో మాదిరిగా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించారు. 1 నుంచి 9వ తరగతి వరకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలు ప్రచురిస్తున్నారు. అన్ని మీడియం పాఠశాలలకు బైలింగ్వుల్ పుస్తకాలు అందించనున్నారు.
జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసే కిట్లలో నాణ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి దశలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..