Andhra Pradesh: రాజకీయాల్లో ఇదో రేర్ ఫీట్.. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ
అన్న మాట ప్రకారం పేరు వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లో సవాళ్లు విసురుకోవడం కామన్. కానీ వాటిపై నిలబడటం మాత్రం చాలా అరుదు. ఎన్నికల్లో సమయాల్లో.. అప్పుడున్న వాడి వేడిలో సవాళ్లు విసురుకోవడం.. ఆ తర్వాత పలు కారణాలు చెప్పి తప్పించుకోవడం పరిపాటి. కానీ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మాత్రం అందుకు మినహాయింపు అనే చెప్పాలి. గత ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ముద్రగడ. పవన్‌ను పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ.. అలా జరక్కపోతే.. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. సవాల్ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి పేరు మార్చుకున్నారు ముద్రగడ.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 5వ తేదీన ముద్రగడ మీడియా ముందుకు వచ్చారు. తాను సవాల్ చేసి ఓడిపోయానని.. చెప్పినట్టే పేరు మార్చుకుంటాను అన్నారు ముద్రగడ పద్మనాభం. అన్నమాట ప్రకారం తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసి డాక్యుమెంట్లు పంపించారు. ఇది ఇప్పుడు అధికారికంగా OK అయ్యి గెజిట్ వచ్చింది. సో.. ఇకపై ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డి అయింది. ఇక తనను ఉప్మా పద్మనాభం అని పదే, పదే ట్రోల్ చేయడంపై ఆయన సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇంటికి వచ్చినవారికి టిఫిన్ పెట్టి.. కాఫీ ఇవ్వడం తప్పు కాదని.. ఆ విధానం తమ తాత, తండ్రి కాలం నుంచి పాటిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.