Vijayawada: వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు
మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా.. వరదనీటిలో తిరిగిన 12 ఏళ్ల కుర్రాడిని అటాక్ చేసింది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే.. బాలుడు శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎంటరవ్వడంపై వైద్యులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
12 ఏళ్ల భవదీప్‌ది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను వదరలు ముంచెత్తిన వేళ.. బాబు కుటుంబం ఉండే ఇంట్లోకి వరదనీరు చేరింది. ఆ వరదనీరు తగ్గే వరకు కుటుంబంతో అతడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోని సామాన్లు తడవకుండా అమ్మానాన్నలకు సాయం చేశాడు. అయితే అదే రోజు రాత్రి.. బాబు చలి జ్వరంతో పాటు వణుకుతో బాధపడ్డాడు. వైరల్ ఫీవర్ ఏమో అని స్థానిక ఆర్‌ఎంపీ దగ్గర చూయించారు. అతను యాంటిబయోటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ చేశాడు. అయినా పరిస్థితి కుదుటపడలేదు. ఆ తర్వాత టెస్టులు చేయించగా డెంగ్యూ సోకినట్లు తేలింది. అయితే ఉన్నట్టుండి అకస్మాత్తుగా రెండు కాళ్లు తొడల నుంచి అరికాళ్ల వరకు వాచాయి. దీంతో విజయవాడలోని ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు పేరెంట్స్. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు నిర్ఘాంతపోయే వార్త చెప్పారు. వారి కుమారుడికి అత్యంత అరుదున ‘నెక్రోటైజింగ్ ఫాసియైటిస్’ వ్యాధి సోకినట్లు తెలియడంతో.. ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ జబ్బుకు మరో పేరు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్. అంతేకాదు ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి చొచ్చుకుపోయి.. కండరాలను తినేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్‌ఫెక్షన్ మరింత పెరగకుండా.. ఈ నెల 17న కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో కూడా 30శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేసినట్లు గుర్తించారు. అయితే మాములుగా ఈ వ్యాధి షుగర్ ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. కానీ ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా వెళ్లిందనే విషయం డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. భవదీప్ పరిస్థితి తెలిసి.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రూ.10లక్షలు మంజూరుచేయించారు.
బాలుడి శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన శాంపిల్స్ టెస్ట్ చేసిన డాక్టర్లు బాడీలోకి ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు గుర్తించారు. వరదనీటిలో మురుగునీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. జ్వరం వచ్చినప్పుడు కాళ్ల వాపులు లాంటివి కనిపిస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్‌కు చికిత్స అందిస్తున్నారు.. అతను పూర్తిగా కోలుకునేందుకు రెండు, మూడు నెలల వరకు సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..