ఆనందయ్య కరోనా ఔషధం దుష్ఫలితాలు లేవు.. మందుపై శాస్త్రీయ అధ్యయనం జరుగుతోందిః ఆరోగ్యశాఖ కార్యదర్శి
కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర ఆయూష్ అధికారులు కూడా పరిశోధనలు జరుపుతుందన్నారు ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.
Krishnapatnam Anandaiah Corona Medicine: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర ఆయూష్ అధికారులు కూడా పరిశోధనలు జరుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆనందయ్య అందిస్తున్న కరోనా ఔషధం వాడిన వారంతా సంతృప్తిగా ఉన్నారని సింఘాల్ తెలిపారు. ఔషధంలోని మూలికలు, పదార్థాలతో దుష్ఫలితాలు కనిపించలేదని తెలిపారు.
ఆనందయ్య కరోనా ఔషధాన్ని పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఆనందయ్య కరోనా మందుపై శాస్త్రీయ అధ్యయనం చేపడుతున్నట్టు తెలిపారు. ఆనందయ్య ఔషధం వల్లే కరోనా తగ్గిందా? లేక, వైరస్ తీవ్రత నిదానించడం వల్లే కరోనా తగ్గిందా? అనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
మరోవైపు, కృష్ణపట్నంలోని కరోనా కేసుల సరళి పరిశీలించాలని అధికారులకు సూచించామని అన్నారు. కృష్ణపట్నంలో ఆయుష్ విభాగం అధికారులు పరిశీలించారని, మందు తయారీ విధానం, వాడినవారి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు సింఘాల్ వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర ఆయుష్ విభాగం ఉన్నతాధికారులతోనూ చర్చించామని పేర్కొన్నారు.
ఆనందయ్యను అరెస్ట్ చేయలేదుః కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఇదిలావుంటే, కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవమని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనన కొట్టిపారేశారు. దయచేసి ఎవ్వరూ ఇటువంటి పుకార్లను నమ్మవద్దని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.