MILAN 2022: విశాఖలో ఘనంగా మొదలైన మరో అంతర్జాతీయ సమాహారం.. రేపు హాజరుకానున్న సీఎం జగన్‌!

2016లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించి సత్తా చాటిన మహా నగరం.. ఇటీవల ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూని కూడా ఘనంగా నిర్వహించిన విశాఖ మరో వేడుకకు ముస్తాబైంది.

MILAN 2022: విశాఖలో ఘనంగా మొదలైన మరో అంతర్జాతీయ సమాహారం.. రేపు హాజరుకానున్న సీఎం జగన్‌!
Milan 2022
Follow us

|

Updated on: Feb 26, 2022 | 6:52 AM

MILAN-2022 at Visakhapatnam:  విశాఖ సాగర తీరం అంతర్జాతీయ విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ(International Fleet Review) నిర్వహించి సత్తా చాటిన మహా నగరం.. ఇటీవల ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ(President Fleet Review)ని కూడా ఘనంగా నిర్వహించిన విశాఖ మరో వేడుకకు ముస్తాబైంది. బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్-2022 సాగర తీరంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 9 రోజుల పాటు రెండు దశల్లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, పలు దేశాలకు చెందిన నౌకలు విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి. కాగా, తొలిరోజున హార్బర్ దశలో సాంకేతిక అంశాలను పరిశీలించారు వివిధ దేశాల నేవీల ప్రతినిధులు. వారికి భారత నౌకాదళం పలు అంశాలను వివరిస్తూనే, వారి నుంచి సాంకేతిక విషయాలను తెలుసుకున్నారు. కాగా నేడు (ఫిబ్రవరి26) తూర్పు నౌకాదళంలో నేవీల ఆధునికతపై సదస్సు జరగనుంది. దీనికి పలు దేశాల నేవీ అధికార్లు హాజరుకానున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సాంగత్యం, పొందిక, సహకారం లక్ష్యాలుగా ఈ మిలన్‌ను నిర్వహిస్తున్నారు.

రేపు విశాఖకు సీఎం జగన్‌ కాగా మిలన్-2022లో భాగంగా రేపు (ఫిబ్రవరి 27) విశాఖ ఆర్కే బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో నేవీ కవాతుతో పాటు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖ నౌక, జలాంతర్గామి ఐఎన్ఎస్ లను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి. అంతర్జాతీయ సాంస్కృతిక బృందాలతో నేవీ నిర్వహించే ఈ పరేడ్ ఆకర్షణీయంగా సాగనుంది. నౌకాదళం సాహస విన్యాసాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. గగన తలంలో ఎయిర్ క్రాప్టులు, హెలీకాప్టర్లు సాహస విన్యాసాలతో నగరవాసులను అలరించనున్నాయి. మిలాన్‌-2022 ఉత్సవాల కోసం ఇప్పటికే ఆర్కే బీచ్‌లో నౌకాదళం విస్తృత ఏర్పాట్లు చేసింది. అటు మిలాన్‌-2022 నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని చెప్పారు, విశాఖ పోలీసు కమిషనర్ మనీశ్‌ కుమార్ సిన్హా . బీచ్ రోడ్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్కుహోటల్ కూడలి వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని విశాఖ పోలీసు కమిషనర్ చెప్పారు.

రెండు దశల్లో విన్యాసాలు నౌకాదళ విభాగంలో కీలకమైన మిలన్‌ కోసం ఇండియన్‌ నేవీ 46 దేశాలను ఆహ్వానించగా, 39 దేశాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. మిలన్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే 10 దేశాలకు చెందిన అధికారులు, యుద్ధ నౌకలు విశాఖ చేరుకున్నాయి. శుక్రవారం మిగిలిన దేశాల ప్రతినిధులు హాజరవుతారని నౌకా దళాధికారులు వెల్లడించారు. ఈ విన్యాసాలు రెండు దశల్లో జరుగుతాయి. 25 నుంచి 28 వరకు హార్బర్‌ ఫేజ్‌లో, మార్చి 1 నుంచి 4 వ తేదీ వరకూ సీఫేజ్‌ విన్యాసాలు నిర్వహిస్తారు. 26వ తేదీన మిలన్‌ విలేజ్‌ ప్రారంభిస్తారు. 27న బీచ్‌ రోడ్డులో ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా క్రీడా పోటీలు, విదేశీ సందర్శకుల కోసం ఆగ్రా, బోధ్‌గయకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 28న సముద్ర జలాల వినియోగం, భద్రతలో సామూహిక సహకారం అనే అంశంపై వివిధ దేశాల ప్రతినిధులతో సదస్సు నిర్వహిస్తారు. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో విన్యాసాలు జరుగుతాయి.

ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్ మిలన్‌లో కీలకమైనది 27న జరిగే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ దేశాల నౌకాదళ అధికారులు సహా మొత్తం 5 వేల మంది అతిథులు హాజరవుతారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర జరిగే పరేడ్‌ని తిలకించేందుకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మిలన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, రక్షణ రంగ ఉన్నతాధికారులు, వివిధ దేశాలకు చెందిన 150 మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇందు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 5 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఇతర జిల్లాల నుంచి సివిల్‌ పోలీస్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, స్పెషల్‌ పోలీస్‌ను రప్పిస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ వంటి తీవ్రవాద నిరోధక దళాలతో పాటు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్, మార్కోస్‌ వంటి కేంద్ర భద్రతా దళాలతో కూడిన సుమారు 3,500 మందిని నగరంలో మోహరించనున్నారు.

Read Also… Pulse Polio: తల్లిదండ్రులకు అలర్ట్‌.. రేపే పల్స్‌ పోలియో కార్యక్రమం.. పూర్తి వివరాలు..