నెల్లూరు వేమిరెడ్డి లాంటి అభ్యర్థిని ఢీకొట్టే మరో పెద్దారెడ్డి ఎవరా అన్న చర్చ జరిగింది ఇప్పటిదాకా.. వేమిరెడ్డిని ఢీకొట్టే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించింది వైసీపీ అధిష్ఠానం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పోటీ ఖాయమైంది. దీంతో ఇద్దరు పెద్దారెడ్ల మధ్య పోరు ఓ రేంజ్ లో ఉండనుందా..? లేక వైసీపీ చెబుతున్న విధంగా వార్ వన్ సైడ్ గా ఉంటుందా..?. నెల్లూరు పార్లమెంట్ వేదికగా వీఎస్ఆర్ వర్సెస్ వీపీఆర్.
నెల్లూరు రాజకీయం ఎప్పుడూ ఒకలా ఉండదు. అయితే గత ఫలితాలు చూస్తే మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. నిన్నటి దాకా జిల్లా వైసీపీలో అభ్యర్థి ఎంపికపై అంతర్మధనం. జిల్లా టీడీపీలో ఎప్పుడూ లేని ఉత్సాహం. ఒక్కసారిగా ఈ టాక్ మారిపోయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి కేంద్రంగా మారినట్టే మారి మరో మలుపు తీసుకుంది. టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్ఫర్మ్ అయ్యింది. వైసీపీ నుంచి ఎవరన్నది తేలింది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు మంచి మిత్రులు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఇద్దరి మధ్య మంచి పరిచయాలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒప్పించి వైసీపీలో చేర్పించింది విజయ సాయిరెడ్డి. అలాంటిది తాను తీసుకొచ్చిన వేమిరెడ్డితోనే విజయసాయి రెడ్డి తలపడుతున్నారు. గతంలో మంచి మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా మారాక మాటల యుద్ధం కొనసాగుతోంది.
నెల క్రితం నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా ఉన్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. పార్టీలో తనకు అవమానం జరిగుతోందంటూ తాను పోటీ చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసి వెళ్లిపోయారు. పార్టీ ముఖ్యనేతలు ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వేమిరెడ్డి తగ్గలేదు. ఆతర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. నెల్లూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో నిన్నటిదాకా వైసీపీకి వేమిరెడ్డి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం వేమిరెడ్డిని చూసి ధైర్యంగా ఉన్నారు. అప్పటిదాకా టీడీపీకి సరైన అభ్యర్థి ఎంత వెతికినా దొరకని పరిస్థితి. వేమిరెడ్డి నిర్ణయంతో టీడీపీకి ఉన్న ఆ లోటు తీరిందని అనుకున్నారంతా..
అప్పటి నుంచి వైసీపీలో క్యాడర్ డీలా పడింది. వేమిరెడ్డి లాంటి అభ్యర్థి వైసీపీకి దొరికేనా అని.. జిల్లాకు చెందిన, అలాగే బయట వ్యక్తులను ఇక్కడి నుంచి బరిలోకి దింపే ప్రయత్నంలో పలువురి పేర్లని అధిష్ఠానం పరిశీలించింది. చివరకు ఇదే జిల్లాకు చెందిన విజయ సాయిరెడ్డిని రంగంలోకి దించింది. విజయసాయిరెడ్డి జిల్లా వాసి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి. జిల్లాలో మంచి పరిచయాలు ఉండడం.. ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో అన్ని విధాలా వేమిరెడ్డితో తలపడే అభ్యర్థిగా అధిష్టానం విజయసాయి రెడ్డిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు ఆపార్టీ నేతలు.
ఇదిలావుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యలు కాకా ముందే జిల్లాలో సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టారు.. పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఇంచార్జ్ గా ఇటీవల చాలా పర్యటనలు చేశారు. విజయసాయిరెడ్డి నిన్నటిదాకా జిల్లా రీజినల్ కోర్దినేటర్ గా ఉండడం.. జిల్లా వైసీపీలో క్షేత్రస్ధాయిల్ అందరితో పరిచయాలు ప్లస్ పాయింట్ కాగా.. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అలాగే ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణలో భాగంగా నెల్లూరు సీటీ నుంచి మైనారిటీ అయిన డిప్యూటీ మేయర్ ఖలీల్‌కు అవకాశం ఇచ్చింది. అలాగే ఇప్పటిదాకా రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యతగా ఉన్న కందుకూరు నుంచి బీసీకి అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. దీంతో లోక్‌సభ పరిధిలో గత ఎన్నికల కంటే ఓటు శాతం బాగా పెరుగుతుందని, ఇది తమకు బాగా కలిసొచ్చే అంశంగా చెబుతోంది వైసీపీ.
అలాగే తనకు గౌరవం లేని కారణంగా పార్టీని వీడానంటున్న వేమిరెడ్డి ఈ ఎన్నికల్లో తానేంటో చూపిస్తానని అంటున్నారు. ఇవ్వరికి ఇవ్వని ప్రాధాన్యత ఇచ్చినా పార్టీని వీడిన వేమిరెడ్డికి ఓటమిని పరిచయం చేస్తామంటోంది వైసీపీ. నెల్లూరు పార్లమెంట్ వేదికగా డీ అంటే ఢీ అంటున్నట్టు మారింది ఇక్కడి రాజకీయం.
ఉత్కంఠగా నెల్లూరు పార్లమెంట్ పోటీ
2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు లోక్ సభ పరిధిలో వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల మధ్య పోటీ రాష్ట్రంలోనే ఉత్కంఠగా మారింది. ఈ ఇద్దరు కూడా మొన్నటి వరకూ వైసీపీ పార్టీలో అగ్ర నేతలుగా చలామణి అయిన వాళ్ళే. నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల మూలంగా ఎన్నికల ప్రత్యర్థులుగా మారారు. ఇంకో విషయం ఏమిటంటే వైసీపీ పార్టీ పెట్టాక ఆ పార్టీ తొలి రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అయితే రెండవ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వారే ఇప్పుడు లోక్ సభ ప్రత్యర్థులు కావడం గమనించాల్సిన విషయం. నెల్లూరు లోక్ సభ ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోట..తర్వాత వైసీపీ కి అడ్డా గా మారిందని ఫలితాలు చెబుతున్నాయి.
తెలుగు దేశం పార్టీని స్థాపించిన తర్వాత నాలుగు దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే, ఇక్కడ ఆపార్టీ విజయం సాధించింది కేవలం రెండుసార్లు మాత్రమే. 1984,1999 ఎన్నికలలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నెల్లూరు లోక్ సభ నుండి కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాల కాలంలో 1989,1991,1996,1998, 2004, 2009 ఎన్నికలలో మొత్తం ఆరు సార్లు గెలిచింది. వైసీపీ పార్టీ వచ్చాక, 2012 ఉప ఎన్నికలలో 2014, 2019 సాధారణ ఎన్నికలలో ఆ పార్టీ వరుసగా మూడు సార్లు విజయం సాధించింది.
ఈసారి లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నందున అసెంబ్లీ అభ్యర్థుల ప్రభావం కూడా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉంది. ఈ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా మెజార్టీ అసెంబ్లీ లలో విజయం సాధించిన పార్టీ ఈ పార్లమెంట్ ను కైవసం చేసు కోవచ్చంటున్నారు విశ్లేషకులు. లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు, ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. వైసీపీ నుండి నెల్లూరు సిటీకి ఖలీల్ అహ్మద్, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కావలికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి, కందుకూరు బుర్రా మధుసూధన్ యాదవ్ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. వైసీపీ ఒక మైనార్టీ కి ఒక బీసీ కి ఈ లోక్ సభ పరిధిలో సీట్లు ఇచ్చింది.
టీడీపీ నుండి నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి పి.నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు వేమిరెడ్డి ప్రశాంతి, కావలి కావ్య కృష్ణా రెడ్డి, ఉదయగిరి కాకర్ల సురేష్, ఆత్మకూరు ఆనం రామనారాయణరెడ్డి, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరిలో ఒకరు కాపు, ఇద్దరు కమ్మ సామాజిక వర్గం కాగా నలుగురు రెడ్డి సామాజిక వర్గంనకు చెందిన అభ్యర్థులు కావడం విశేషం.
వైసీపీకి రెబల్ గా మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నారు. అందులో ఇద్దరు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. ఇది తమకు బలంగా మారి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డ్ తిరగరాస్తామని అంటోంది టీడీపీ. చూడాలి మరీ ఓటర్ మహాశయులు ఎవరిని ఆదరిస్తారోనని..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…