AP Politics: సజ్జలతో భేటీ అనంతరం వసంత కృష్ణ ప్రసాద్ కీలక కామెంట్స్.. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా..?
వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల వేడిని ఆయన కొడుకు కృష్ణప్రసాద్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

తండ్రి చేసిన వ్యాఖ్యలకు కొడుకు వివరణ ఇచ్చారు. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీనిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రస్తుతం కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత లేదని, ఒక్క మంత్రి కూడా లేరని వ్యాఖ్యానించారు నాగేశ్వరరావు. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యే తండ్రే ఇలాంటి కామెంట్స్ చేయడంతో.. అధికార పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. తన తండ్రి వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయ్యారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వాటిని తీవ్రంగా ఖండించారు.
అయినా అక్కడితో ఆగకుండా పార్టీ పెద్దలను కలిసి వివరణ ఇచ్చారు కృష్ణప్రసాద్. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మాట్లాడారు. తన తండ్రి వ్యాఖ్యల గురించి, ఆయన తీరుపై మాట్లాడారు. తన తండ్రి వ్యాఖ్యల్ని పార్టీ పెద్దలు లైట్‌గానే తీసుకున్నారని, అయినా తాను చెప్పాల్సింది తాను చెప్పానన్నారు వసంత కృష్ణ ప్రసాద్. అయినా ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు కృష్ణప్రసాద్. తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా డేంజర్ అని, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజమని చెప్పుకొచక్చారు.
ట్విట్టర్‌లోనూ రియాక్ట్ అయ్యారు వసంత కృష్ణప్రసాద్. మా నాయకుడి మాటే నా బాట అంటూ ట్వీట్ చేశారు. ఆయన మాటే తనకు శిరోధార్యమని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌తోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ పోటీ చేయమంటే చేస్తానని, లేకుంటే ఎవరైనా నిలబెట్టి గెలిపించమని చెప్పినా.. ఆ విధంగానే చేస్తానని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..




