అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ తమదే అడ్డా అన్నట్టుగా రెచ్చిపోతున్నాయి. అడవుల్లో ఆహారం దొరక్కపోవడంతో గ్రామాల్లో తిష్టవేసి… ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. పిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడులకు తెగబడుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు అంతు చూస్తున్నాయి. వానరం గుంపు దాడుల కారణంగా ఇప్పటికే అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు. తాజాగా.. కోతుల దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వానరం గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో బాలుడు లిఖిత్ తలకు తీవ్ర గాయమైంది. కోతుల దాడితో పసికందు ఏడ్వగా.. ఏం జరిగిందోనని తల్లిదండ్రులు పరుగు పరుగున ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కోతుల దాడి చేయటాన్ని చూసి ఆందోళనకు గురైన… కర్రతో వాటిని తరిమేశారు. బాలుడిని మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక్కడే కాదు కోతుల బెడదతో చుట్టుపక్కల గ్రామాలు సైతం విలవిల్లాడిపోతున్నాయి. ఈ కోతుల బీభత్సంతో అటు మన్యం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటరిగా బయటకు వెళ్లాలంటే హడలిపోతున్నారు మారెడుమిల్లి వాసూలు. అవి ఎక్కడ మాటు వేసి ఉన్నాయో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇందుకూరుపేట ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశాయి. ఆస్పత్రిలో నానా రచ్చ చేసి సెలైన్ బాటిల్ ఎత్తుకెళ్లాయి. తాజాగా మారేడుమిల్లిలో చిన్నారిపై దాడి చేశాయి.
ఇలా చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా కోతులే కోతులు. ఇళ్లు, పొలం, గుడిబడీ ఎక్కడ చూసినా కోతుల గుంపులే. గ్రామాల్లో స్వైరవిహారం చేస్తూ ఈ వానరాలు సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. బైక్స్ సీట్స్ కవర్లు చింపేయడం, విలువైన పత్రాలు ఎత్తుకుపోవడం, ఇళ్లల్లోకి చొరబడి ఆహారం లాక్కెళ్లిపోతుండటంతో జనం హడలిపోతున్నారు. కోతుల బెడద నుంచి తమను కాపాడేవాడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయిందంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..