Ambati Rambabu: టీడీపీ వల్లే పోలవరం ఆలస్యం.. తెలంగాణ మంత్రుల ప్రచారం అవాస్తవం.. మంత్రి అంబటి రాంబాబు..
పోలవరం కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లే ఆలస్యం అయిందంటూ మంత్రి అంబటి రాంబాబు వివరించారు. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరు..? అంటూ ప్రశ్నించారు.
Ambati Rambabu on Polavaram Project: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. పోలవరం కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లే ఆలస్యం అయిందంటూ వివరించారు. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరు..? అంటూ ప్రశ్నించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు చంద్రబాబు ఇప్పుడు వరద బాధితుల దగ్గరకు వెళ్లారంటూ విమర్శించారు. వరద బాధితులకు రెండు వేలు తక్షణ సాయం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా..? అంటూ మంత్రి అంబటి పేర్కొన్నారు. దేవినేని ఉమా మరొక్కసారి ఏవయ్యా రాంబాబు అంటే ఊరుకునేది లేదని.. అతన్ని కూడా ఒరేయ్ తురేయ్ అనాల్సి వస్తుందన్నారు. సీఎంపై అవాకులు చవాకులు పేలాడానికి సిగ్గు లేదా..? అంటూ నిలదీశారు. ఇంత వరద వచ్చినా ప్రాజెక్ట్‌కు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానెల్ పూర్తి చేశామన్నారు. డయాఫ్రమ్ వాల్ గురించి అన్ని తెలియాలంటే.. తానేమి ఇంజినీర్‌ను కాదని..కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నారు.
పోలవరంపై తెలంగాణ మంత్రులు చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇచ్చారని స్పష్టంచేశారు. 45.72 అడుగుల ఎత్తువరకూ నీళ్లు నింపినా ఎలాంటి ముప్పు ఉండదని అంబటి చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా 2700 కోట్లు రావాల్సి ఉందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..