ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్,22: పిల్లలు కాకుండా ఉండాలంటే మహిళలకే ఆపరేషన్ చేయించాలి అనేది సమాజంలో ఏళ్లుగా స్థిరపడిపోయింది. పురుషులు కూడా వేసక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చని ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నా కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే అపోహలతో మగవాళ్లు వెనుకడుగు వేస్తున్నారు. అక్కడక్కడ ఏడాదికి ఒకరో ఇద్దరో అంగీకరిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోతోంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సను మహిళలు, పురుషులు కూడా చేపించుకోవచ్చు. మహిళలకు చేసే ఆపరేషన్ ను “ట్యూబెక్టమి” అంటారు. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన “ఫాలోపియన్” నాళాలను రెండు వైపులా కత్తిరించి ముడి వేస్తారు. పురుషులకు చేసేదాన్ని “వేసక్టమీ” అంటారు. వీర్యం ప్రయాణించే వాహికను కట్ చేసి ఆ మార్గాన్ని మూసివేస్తారు . దీనివల్ల లైంగిక శక్తి ఏమాత్రం తగ్గదు కానీ పిల్లలు వద్దనుకున్న పురుషులు మాత్రమే ఈ ఆపరేషన్ చేయించుకోవాలి.
గత కొన్నేళ్లుగా వేసక్టమీ ఆపరేషన్ గురించి పెద్దగా ప్రచారం లేదు అనడంలో ఎలాంటి తప్పులేదు. ప్రచారం పూర్తిగా లేదు. అయితే గత రెండు మూడేళ్లుగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అక్కడక్కడ ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ చేయించుకున్న వారి గురించి ఇతరులకు తెలుస్తోంది .గత పది ఏళ్లలో ఒక్కరు కూడా వేసక్టమీ చేయించుకోవడానికి ముందుకు రాని పరిస్థితిలో ఏకంగా ఏడుగురు మగవాళ్లు ఆపరేషన్ చేయించుకోవడం శుభపరిణామముగా వైద్యులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. కోత, కుట్టు.. సమస్య లేదు. రక్తస్రావం జరగదు. ఆపరేషన్ అనంతరం సంసార జీవితానికి ఎలాంటి డొకా ఉండదు అనే వాటిపై ఇంటింటికి వెళ్లి మరింత వివరంగా చెప్పి ఒప్పించాల్సిన అవసరం ఉంది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మహిళలే కాదు మగవారు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చేయించుకోవచ్చు . మహిళల కంటే పురుషులకే ఇది చాలా సులభమైన ఆపరేషన్ అని వైద్యులు చెబుతున్నారు. పది నిమిషాల్లో ఆపరేషన్ పూర్తవుతుంది. ఆపరేషన్ తర్వాత రెండు గంటల్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. ఆపరేషన్ వల్ల ఎలాంటి శారీరక బలహీనత ఏర్పడదు. శక్తి సామర్థ్యాలు ఏమాత్రం కోల్పోరు. సంసార జీవితానికి లైంగిక శక్తికి ఎలాంటి ఢోకా ఉండదు. వేసక్టమి తర్వాత అవసరమైనప్పుడు పిల్లలు కావాలనుకుంటే “రీకెవలైజేషన్'” చేయించుకోవచ్చు. దాని ద్వారా మళ్లీ పిల్లలు అయ్యేలా చూసుకోవచ్చు.. అని వైద్యులు సూచిస్తున్నారు.
గూడూరుకు చెందిన సుంకులమ్మ భర్తతో కలిసి వ్యవసాయ కూలీల పని చేస్తూ జీవనం సాగిస్తోంది ఇద్దరు పిల్లలు. కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని భావించింది. నర్సులు వారి ఇంటికి వెళ్లి మగవారు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చు అని సూచించారు ఇది చేయించుకుంటే మగవారికి శక్తి తగ్గిపోతుంది అట అని అనుమానంతో చివరకు సుంకులమనే ఆపరేషన్ చేయించుకుంది.
కౌతాళం కి చెందిన మరియమ్మ కూరగాయల వ్యాపారం చేస్తుంది భర్త ఆటో డ్రైవర్. ఆమె ఇటీవల మగ బిడ్డను ప్రసవించింది. మూడు కాన్పుల వరకు మగ బిడ్డ కోసం చూసి అది ఫలించడంతో ఇక పిల్లలు చాలు అనుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని భావించింది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికి వచ్చి భర్తకి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయవచ్చు అని సూచించారు. మగవాడు బయట తిరుగుతాడు కాబట్టి శక్తి ఉండొద్దా అని ఎత్తి పొడిచి ఆమెనే ఆపరేషన్ చేయించుకుంది. ఇలాంటివి కేవలం ఉదాహరణలు మాత్రమే. దీనిని బట్టి చూస్తే వేసక్టమి ఆపరేషన్ల గురించి ఎంత అవగాహన లేమి ఉందో అర్థమవుతుంది. వేసక్టమీ పట్ల లాభాలు, అనుమానాలు పై మరింతగా అధికారులు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
కర్నూలు జిల్లాలో గత నాలుగేళ్లుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
2019 20 లో 25 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లక్ష్యం కాగా 16,556 సాధించారు ఇందులో మగవారు ఒక్క ఆపరేషన్ కూడా చేపించుకోలేదు.
2020 21 లో 25 వేల ఆపరేషన్లు లక్ష్యం కాగా 7728 ఆపరేషన్ లు జరిగాయి ఇందులో ఒకే ఒక్క వేసక్టమి ఆపరేషన్ జరిగింది.
2021 22లో 14058 ఆపరేషన్లు లక్ష్యం కాగా 7575 జరిగాయి ఇందులో ఏకంగా నలుగురు పురుషులు ఆపరేషన్ చేయించుకున్నారు.
2022 23లో 13563 లక్ష్యం కాగా 9730 ఆపరేషన్లు జరిగాయి ఇందులో ఇద్దరు మగవారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు.
దీనిని బట్టి చూస్తే ప్రచారం చేసినప్పటికీ మూడేళ్లకు కలిపి కేవలం ఏడుగురు మాత్రమే మగవారు ముందుకు రావడం బట్టి చూస్తే వేశక్టమి ఆపరేషన్ల పట్ల ఎన్ని అపోహలు ఉన్నాయో అర్థం అవుతుంది..
ఏది ఏమైనప్పటికీ మగవారికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పై మరింత మెరుగైన ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..