NTR District: లోన్‌యాప్ గాళ్లు మరో ఉసురు తీశారు.. ఈ సారి బెజవాడ సాక్షిగా
లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఈమధ్య కాలంలో చాలామంది బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

లోన్ యాప్ జోలికి వెళ్తే లైఫ్ కొలాప్స్.. అవసరాల వల పట్టుకుని లోన్ యాప్‌లు రుణపాశాలు విసురుతాయి. దానికి చిక్కినవాళ్లు ఇక యమపాశానికి చిక్కినట్టే. ఇక వాళ్లను చచ్చినా వదలరు. చక్రవడ్డీ.. వక్ర వడ్డీ అన్నీ వేసి నడ్డి విరగ్గొడతారు. ప్రాణాలు పోయినా సరే.. మా డబ్బులు మాకు పంపించండి అంటూ.. రాక్షసుల్లా పట్టి పీడిస్తున్నారు. లోన్ యాప్ ఆగడాలకు నిత్యం ఎంతో మంది బలైపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మరో యువకుడు బలయ్యాడు.
విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన మణికంఠ అనే యువకుడు కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా లోన్ యాప్‌లో 10 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు సరైన టైమ్‌లోనే కట్టేశాడు. కానీ చక్ర వడ్డీ, భూ చక్రవడ్డీలు కలిపి.. ఇంకా లోన్ క్లియర్ అవలేదు.. లోన్ కట్టాల్సిందే అంటూ వేధించారు. మార్ఫ్ చేసిన అతడి న్యూడ్ ఫోటోలు పంపి మానసికంగా వేధించారు. బ్లాక్ మెయిల్ చేశారు. ఇది భరించలేని మణికంఠ ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేధింపులపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్:
ఈ ఆన్‌లైన్ లోన్ యాప్స్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. యాప్స్ నిర్వాహకులు వేధించినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా తమకు కంప్లైంట్ చేస్తే.. యాక్షన్ తీసుకుంటామని ఏపీ హొం శాఖ తెలిపింది. బాధితులు 1930 కాల్ చేసి సమస్యను తెలియజేయాలని కోరింది. రక్తం తాగే రాక్షసుల్లా వ్యవహరిస్తున్న లోన్ యాప్ కేటుగాళ్లను ఎట్టు పరిస్థితుల్లో విడిచి పెట్టమని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా పౌరులకు పలు సూచనలు కూడా చేసింది హోంశాఖ. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అని వచ్చే లింక్స్ ఓపెన్ చేయొద్దని కోరింది. బ్యాంక్ డీటేల్స్, ఆధార్, ఫోటోలు, కాంటాక్ట్‌ల యాక్సిస్ తెలియనివారికి ఇవ్వవద్దని సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
