Vizag: ఏ రాక్షసుడు పూనాడురా నీకు.. 24 గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా భార్య హత్య
విశాఖ మధురవాడ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 9 నెలల గర్భిణి అనూషను పాశవికంగా హత్య చేశాడు భర్త. 24గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా భార్యను గొంతు నులిమి చంపేశాడు. భర్త జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటేల్స్ ఇలా....

24 గంటలలో డెలివరీ కావలసిన గర్భిణిని దారుణంగా చంపేశాడా భర్త. మనస్పర్ధల కారణంగా గొంతు నులిమి చంపేశాడు. రెండేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పీఎం పాలెం ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో కొన్ని మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా అనూష భర్త జ్ఞానేశ్వర్ స్కౌట్స్, సాగర్‌నగర్ వ్యూ పాయింట్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఉదయం అనూషకు ఆరోగ్యం బాగోలేదంటూ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు జ్ఞానేశ్వర్. అంతకు ముందే భార్యను గొంతు నులిమి చంపేశాడు. విగత జీవిగా ఉన్న అనూషను బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మాచురీకి తరలించారు. భార్య అనూషను తానే హత్య చేసినట్లు పీఎం పాలెం పోలీసులు ఎదుట భర్త లొంగిపోయాడు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, మరో అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదని అనూష తల్లి, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరో అమ్మాయితో జ్ఞానేశ్వర్‌కి వివాహేతర సంబంధం కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..