అక్కడంతా భయం భయం.. ఇంట్లో నుండి బయటకు రావాలంటే టెన్షన్..

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మారింది పార్వతీపురం జిల్లాలోని పరిస్థితి. ఇప్పటికే ఆరు ఏనుగుల గుంపుతో ఏజెన్సీవాసులు హడత్తిపోతుంటే.. కొత్తగా మరో నాలుగు ఏనుగుల గుంపు జిల్లాకు వచ్చింది. ఏనుగుల గుంపు బారినపడి ఇప్పటికే ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగితే ఇప్పుడు కొత్తగా జిల్లాకు వచ్చిన రెండో ఏనుగుల గుంపు మరింత హల్చల్ చేస్తుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది.

అక్కడంతా భయం భయం.. ఇంట్లో నుండి బయటకు రావాలంటే టెన్షన్..
Vijayanagaram
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 18, 2024 | 10:45 PM

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మారింది పార్వతీపురం జిల్లాలోని పరిస్థితి. ఇప్పటికే ఆరు ఏనుగుల గుంపుతో ఏజెన్సీవాసులు హడత్తిపోతుంటే.. కొత్తగా మరో నాలుగు ఏనుగుల గుంపు జిల్లాకు వచ్చింది. ఏనుగుల గుంపు బారినపడి ఇప్పటికే ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగితే ఇప్పుడు కొత్తగా జిల్లాకు వచ్చిన రెండో ఏనుగుల గుంపు మరింత హల్చల్ చేస్తుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. జిల్లాను వణికిస్తున్న రెండు ఏనుగులు గుంపులు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాయి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? స్థానికంగా ప్రస్తుత వాతావరణం ఏంటి? ఇదే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. అంతా భయం భయం.. ఇంట్లో నుండి బయటకు రావాలంటే టెన్షన్ టెన్షన్. పంట పొలాల్లోకి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిందే.

జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఎప్పుడు ఎటు వైపు నుండి వస్తాయో? ఎవరి పై దాడి చేసి ఎలా హతమారుస్తాయో తెలియని ఆందోళనకర పరిస్థితులు జిల్లావాసులను కలవరపెడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హడలెత్తిస్తుంది. సుమారు ఏడేళ్ల క్రితం ఒడిస్సాలోని లఖేరి అటవీప్రాంతం నుండి ఎనిమిది ఏనుగుల గుంపు జిల్లాకు చేరుకుంది. అలా వచ్చిన ఏనుగుల గుంపులో వివిధ కారణాలతో కొన్ని మృత్యువాత పడగా, మరికొన్ని కొత్తగా జన్మించాయి. అలా ప్రస్తుతానికి ఆరుకి చేరిన ఏనుగుల గుంపు ఏజెన్సీలో సంచరిస్తూ స్థానికులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ గుంపు జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం మండలాల్లో తిష్ట వేసి సంచరిస్తూ ఉంటుంది. నాగావళి నదీ ప్రాంతం కావటంతో త్రాగునీటికి, ఆహారానికి కూడా అనుకూలంగా ఉండటంతో ఏనుగులు ఈ ప్రాంతాన్ని అనువుగా ఎంచుకున్నాయి.

ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు పలు సందర్భాల్లో రెచ్చిపోయి రోడ్లపైకి వచ్చి ఘీంకారాలు చేస్తూ వాహనదారులపై దాడికి తెగబడుతుంటాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎనిమిది మృతి చెందగా, మరో ముప్పై మందికి‎పైగా తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయం నుండి బయటపడ్డాయి. దీంతో ఏనుగుల దెబ్బకి స్థానికులు ఇళ్ళలో నుండి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది ఎకరాల పంటపొలాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. గత ఏడేళ్లలో వందలాది ఎకరాల అరటి, మొక్కజొన్న, బొప్పాయి తోటలను ధ్వంసం చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఏనుగులు నాశనం చేయటంతో లబోదిబోమంటున్నారు రైతులు. రైతుల నష్టానికి అటవీశాఖ సిబ్బంది కూడా నష్టపరిహారం అంతంత మాత్రంగానే ఇస్తున్నారు.

ఏనుగులు అంతటితో ఆగకుండా అర్ధరాత్రి గ్రామాల్లోకి చొరబడి పెద్దఎత్తున ఘీంకారాలు చేస్తూ పశువులపై దాడిచేయటంతో పాటు ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నాయి. అర్ధరాత్రి ఏనుగుల ఘీంకారాలకు భయంతో వణికిపోతున్నారు గ్రామస్థులు. వాటిని గ్రామం నుండి బయటికి పంపేందుకు గ్రామస్తులు అర్ధరాత్రి సమయంలో దండోరాలు, కాగడాలు, టపాసుల సహాయంతో నానా అవస్థలు పడాల్సివస్తుంది. అయితే ఈ ఏనుగులు ఒక ప్రాంతంలో ఉండకుండా నీరు, ఆహార అవసరాల కోసం తరుచూ మకాం మారుస్తూ ఉంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాయో తెలియక, ఎటువైపు వెళ్లి ఏ విధంగా ఎవరిపై దాడి చేస్తాయో అర్ధంకాక అయోమయంలో భయంతో కాలం గడుపుతున్నారు జిల్లావాసులు.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా మరో సమస్య వచ్చిపడింది. ఇప్పటికే సంచరిస్తున్న ఆరు ఏనుగులతో జిల్లావాసులు భయంభయంగా బ్రతుకుతుంటే ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళం జిల్లా నుండి మరో నాలుగు ఏనుగుల గుంపు ఇక్కడకు చేరుకున్నాయి. అలా వచ్చిన ఏనుగుల గుంపు గుమ్మ లక్ష్మీపురం మండలం జరడ గ్రామంలో సంచరిస్తూ గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. గిరిజనులు పండిస్తున్న రాగులు, జొన్నలతో పాటు ఇతర చిరుధాన్యాల పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా రాత్రి సమయంలో గ్రామాలకు ప్రవేశిస్తూ ఘీంకరాలు చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఏనుగులు గుంపు ప్రవర్తన కూడా భయానకంగా ఉండటంతో స్థానికులు వణికిపోతున్నారు.

గతంలో ఉన్న ఆరు ఏనుగుల గుంపుకే ప్రాణ ఆస్తి నష్టం జరిగి జిల్లా వాసులు భయం భయంగా కాలం గడిపితే ఇప్పుడు కొత్తగా జిల్లాకు వచ్చిన నాలుగు ఏనుగుల గుంపుతో తలలు పట్టుకుంటున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించాలని ఎప్పటినుండో స్థానికులు డిమాండ్ చేస్తున్నా అది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఏనుగులను తరలించాలని జిల్లావాసులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్న రెండు ఏనుగుల గుంపులతో జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇప్పటికైనా ఏనుగుల గుంపు సమస్యపై పరిష్కారం చూపి తమ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు జిల్లా వాసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..