Rain Alert: ప్రజలకు కూల్ న్యూస్.. మూడు రోజుల పాటు ఫుల్లుగా వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్..
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.. ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.. ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు రేపు శ్రీకాకుళం 8, విజయనగరం 6, మన్యం 12, అల్లూరి జిల్లా 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలో 42.5మిమీ, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 38.2మిమీ, కోనసీమ మండపేట, విజయనగరం కొత్తవలసలో 30.5మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగలలో 27.2మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 26మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 30 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.
ఇదిలాఉంటే.. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..