Rayalaseema reservoirs : శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు భారీగా ఇన్ ఫ్లో.. నీటితో తొణికిసలాడుతోన్న ప్రాజెక్టులు
వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలకు అతి ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, తుంగభద్ర..
Srisailam – Tungabhadra – reservoir: వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలకు అతి ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు దిగువ.. ఎగువ కాలువ, ఆర్డీఎస్, కేసీ కెనాల్ ద్వారా తాగు, సాగు నీరు అందుతుంది. అలాంటి తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రస్తుతం పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. సీమవాసులకు ఇదో పెద్ద తీపి కబురు. తుంగభద్ర డ్యాం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 46.3 టిఎంసిలు ఉంది.100 టీఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యామ్ కు 57 వేల క్యూసెక్కులు పైగా వరద నీరు వచ్చిచేరుతుండటంతో డ్యామ్ పూర్తిస్థాయి నీటితో తొణికిసలాడుతోంది.
ఇక, శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇప్పుడిప్పుడే భారీఎత్తున వరద నీరు వస్తోంది. జూరాల గేట్లు ఎత్తడంతో 85 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చిచేరుతోంది. అయితే, లెఫ్ట్ పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తి కారణంగా నీరు దిగువకు వదిలాల్సి వస్తోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 38 టీఎంసీలు మాత్రమే ఉంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలలో వర్షాల కారణంగా ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులకు వరదనీరు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో జూరాల గేట్లు ఎత్తి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు వదులుతున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 36,750 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులుకాగా, ప్రస్తుతం 809.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 34.1004 టీఎంసీలు ఉంది. అయితే, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా ఇంకా కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.