AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకాశం జిల్లాకు కొట్టుకొచ్చిన తమిళనాడు బోటు.. తాజాగా తీరానికి మృతదేహాలు..!

ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌కు మురసు తుఫాన్ ప్రభావంతో కొట్టుకొచ్చింది. ఆ ప్రాంతంలో తాజాగా నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఈ బోటు తమిళనాడులోని చెన్నై లేదా కడలూరుకు చెందినదిగా స్థానిక మత్స్యకారులు అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి బోట్లలో 10-15 మంది ఉంటారని, ఇది తీరానికి దగ్గరలోనే మునిగిపోయి ఉంటుందని చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాకు కొట్టుకొచ్చిన తమిళనాడు బోటు.. తాజాగా తీరానికి మృతదేహాలు..!
Kottapatnam Beach Tragedy
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2026 | 11:21 AM

Share

ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌లోని పల్లిపాలెం తీరంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం వీచిన మురసు తుఫాన్ ప్రభావంతో ఓ బోటు సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. తుఫాన్ తీరం దాటిన తెల్లారే ఆ బోటు కనిపించింది.  దీంతో స్థానిక జాలర్లు వెళ్లి పరిశీలించగా.. కేవలం బోటు మాత్రమే ఉంది.. లోపల ఎవరూ కనిపించలేదు. అయితే తాజాగా  నాలుగు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. స్థానిక మత్స్యకారులు అందించిన సమాచారం ప్రకారం, ఈ బోటు చెన్నై లేదా కడలూరు ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. తీరానికి అతి దగ్గరలోనే సముద్రంలో మునిగిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. అదనంగా, మన్నూరు వద్ద ఒకటి, గుండమ్మల వద్ద ఒకటి సహా మొత్తం ఆరు మృతదేహాలు వివిధ ప్రాంతాలకు చేరినట్లు చెబుతున్నారు. సాధారణంగా అలాంటి బోట్లలో 10 నుంచి 15 మంది మత్స్యకారులు వేటకు వెళ్తారని, నెల రోజుల పాటు వేట కొనసాగించి తిరిగి వస్తారని స్థానిక మత్స్యకారులు వివరిస్తున్నారు. ఈ ప్రాంతంలో తుఫాన్ వాతావరణం ఉన్నప్పుడు స్థానిక బోట్లు హార్బర్‌లోకి వెళ్ళిపోతాయని, అయితే చెన్నై, కడలూరుకు చెందిన మత్స్యకారులు తుఫాన్లను లెక్కచేయకుండా వేటకు వెళ్తుంటారని వారు అభిప్రాయపడ్డారు.

కొట్టుకొచ్చిన బోటు ఆకుపచ్చ రంగులో ఉందని, ఇది చెన్నై లేదా కడలూరు ప్రాంతానికి చెందిన బోటుగా బలమైన అనుమానాన్ని స్థానిక జాలర్లు వ్యక్తం చేశారు. బోటులో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటివరకు స్పష్టంగా తెలియడం లేదు. అయితే, చాలామంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. మునిగిపోయిన బోటు నిన్నటి వరకు కొంత కనబడుతూ ఉండగా, ఈ రోజు పూర్తిగా సముద్రం అడుగు భాగంలోకి చేరుకుందని స్థానికులు చెప్పారు. ఇప్పటివరకు ఈ బోటు కర్ణాటక లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సంబంధించి అధికారికంగా గుర్తించబడలేదు. ఈ ఘటనతో కొత్తపట్నం ప్రాంతవాసులలో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Follow Us