బ్లడ్ బ్యాంక్‌లపై సైబర్ దాడులు.. రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతను పెంచేసిన హ్యాకర్లు!
ఫ్రాన్స్‌లో బ్లడ్ ప్లాస్మా నిల్వ కేంద్రాలపై సైబర్ దాడి కలకలం రేపింది. రక్తం, ప్లాస్మాను భద్రపరిచే రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతలను అత్యంత ఎక్కువ స్థాయికి పెంచేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన అధికారులు సకాలంలో దాడిని గుర్తించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రక్త ఉత్పత్తులు, ప్లాస్మా నమూనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.

ఫ్రాన్స్‌లో బ్లడ్ ప్లాస్మా నిల్వ కేంద్రాలపై సైబర్ దాడి కలకలం రేపింది. రక్తం, ప్లాస్మాను భద్రపరిచే రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతలను అత్యంత ఎక్కువ స్థాయికి పెంచేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన అధికారులు సకాలంలో ఈ దాడిని గుర్తించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రక్త ఉత్పత్తులు, ప్లాస్మా నమూనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
మూడు కేంద్రాలే లక్ష్యంగా సైబర్ దాడి
ఫ్రాన్స్‌లో రక్త సేకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలను ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (EFS) నిర్వహిస్తోంది. ఈ సంస్థకు రిఫ్రిజిరేషన్ పరికరాలను సరఫరా చేసే ఓ కంపెనీ వ్యవస్థను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం జరిగిన ఈ సైబర్ దాడిలో మూడు ప్లాస్మా నిల్వ కేంద్రాల్లోని రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతలు, డీఫ్రాస్టింగ్ సెట్టింగ్‌లను అత్యంత ఎక్కువ స్థాయికి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే అలారం వ్యవస్థలు వెంటనే అసాధారణ మార్పులను గుర్తించాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నారు. ఫలితంగా నిల్వ చేసిన రక్త ఉత్పత్తులకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడగలిగారు.
ముందుజాగ్రత్తగా మరో కేంద్రాలకు తరలింపు
ముందు జాగ్రత్త చర్యగా రిఫ్రిజిరేటర్లలోని బ్లడ్ ప్లాస్మా బ్యాగులను ఇతర కేంద్రాలకు తరలించారు. ఈ కేంద్రాల్లో రోగులకు రక్త మార్పిడి (ట్రాన్స్‌ఫ్యూజన్) కోసం ఉపయోగించే ప్లాస్మా బ్యాగులతో పాటు, ఔషధాల తయారీలో వినియోగించే ప్లాస్మాను కూడా నిల్వ చేస్తారు. ఈ నేపథ్యంలో సైబర్ దాడిని అధికారులు తీవ్రంగా పరిగణించారు.
యూరప్‌లో విస్తరిస్తున్న సైబర్ దాడులు
ఫ్రాన్స్‌లో జరిగిన ఈ ఘటన యూరోప్ దేశాల్లో కొనసాగుతున్న సైబర్ దాడుల పరంపరలో భాగమని తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లోని సూపర్ మార్కెట్లలో రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. రిమోట్‌గా వాటి ఉష్ణోగ్రతలను మార్చడంతో ఆహార పదార్థాలు పాడైపోయాయి. దీంతో సంస్థలకు లక్షల యూరోల నష్టం వాటిల్లింది.
తాజా పరిణామాలతో ఫ్రాన్స్‌లోని అన్ని రక్త నిల్వ కేంద్రాల్లో రిఫ్రిజిరేషన్ పరికరాల పర్యవేక్షణను EFS మరింత కట్టుదిట్టం చేసింది. మరోవైపు ఫ్రాన్స్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ ANSSI, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. ఈ దాడి వెనుక ఎవరున్నారు? అసలు ఎలా జరిగింది? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సైబర్ దాడి మూలాలు, బాధ్యుల వివరాలు ఇంకా తెలియరాలేదని EFS తెలిపింది.