Video: హిల్ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి.. చూస్తూ ఉండిపోయిన పర్యాటకులు!
పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ కొందరు పర్యాటకులు ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార పొట్లాలు, ఇతర వ్యర్థాలను పడేస్తుంటారు. ఇలాంటి నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ముస్సోరీలో చోటుచేసుకుంది. భారతీయ పర్యాటక ప్రదేశంలో చెత్త పేరుకుపోవడం చూసి ఓ విదేశీ యువతి స్వయంగా రంగంలోకి దిగి శుభ్రం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది. కానీ కొందరు పర్యాటకులు ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార పొట్లాలు, ఇతర వ్యర్థాలను పడేస్తుంటారు. ఇలాంటి నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ముస్సోరీలో చోటుచేసుకుంది. భారతీయ పర్యాటక ప్రదేశంలో చెత్త పేరుకుపోవడం చూసి ఓ విదేశీ యువతి స్వయంగా రంగంలోకి దిగి శుభ్రం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చెత్తతో నిండిపోయిన మస్సూరీ
ఉత్తరాఖండ్‌లోని మస్సూరీలో ఉన్న దలై హిల్స్ నుంచి హిమాలయ పర్వతాల అందాలను చూడవచ్చు. సమీపంలో బౌద్ధ ఆలయం ఉండటంతో ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అనంత్ ఎం తన సొంత ప్రాంతమైన మస్సూరీని చూపించేందుకు తైవాన్‌కు చెందిన తన స్నేహితురాలిని అక్కడికి తీసుకెళ్లాడు. అయితే దలై హిల్స్‌కు చేరుకున్న తర్వాత వారికి అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యం కలిగింది. అందమైన పర్యాటక ప్రాంతమంతా ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార పొట్లాలు, ఇతర చెత్తాచెదారంతో నిండిపోయింది.
పర్యాటకులంతా చూస్తున్నా.. ముందుకొచ్చిన ఇద్దరు
దీంతో అనంత్ అతడి తైవానీస్ స్నేహితురాలు కలిసి అక్కడి చెత్తను ఏరడం ప్రారంభించారు. చేతులతోనే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ దృశ్యాలను అనంత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. భారతీయ పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఒక విదేశీ యువతి ముందుకు రావాల్సి రావడం బాధాకరమని అతడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ చాలామంది పర్యాటకులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా చెత్త ఏరేందుకు ముందుకు రాలేదని పేర్కొన్నాడు. చెత్తను సేకరిస్తున్న తన స్నేహితురాలిని ఆపి, వ్యర్థాలను వేసేందుకు ఒక సంచి కోసం వెళ్లాడు. అయినప్పటికీ ఆమె మాత్రం చెత్తను ఏరడం కొనసాగించింది.
వీడియోను ఇక్కడ చూడండి
సోషల్ మీడియాలో ప్రశంసలు.. పర్యాటకులపై విమర్శలు
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో చెత్త వేస్తున్న వారి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విదేశీ యువతి చూపిన బాధ్యత, చొరవను ప్రశంసిస్తున్నారు. ప్రకృతి అందాలకు పేరుగాంచిన మస్సూరీ వంటి హిల్‌స్టేషన్లు పర్యాటకుల నిర్లక్ష్యం వల్ల అందాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఎంత ముఖ్యమో వాటిని శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.