TDP: టీడీపీలో ముదురుతున్న విజయవాడ పశ్చిమ సీటు పంచాయతీ
సంక్రాంతి తరువాత అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్న టీడీపీకి.. కొన్ని స్థానాల్లో నేతలు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు. టికెట్ తమకే అని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. తన వర్గం నాయకుడికి సీటు గ్యారంటీ అని కీలక నేత చెప్పడంతో కన్ఫ్యూజన్ మొదలైంది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

టీడీపీలో విజయవాడ పశ్చిమ సీటు పంచాయతీ మరింత ముదురుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య కొనసాగుతున్న విభేదాలులో వ్యవహారం రచ్చకెక్కింది. విజయవాడ వెస్ట్ స్థానం నుంచి ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా దీనిపై ఎంపీ కేశినేని నాని క్లారిటీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నుంచి తాను లేదా తన కుటుంబసభ్యులెవరూ పోటీ చేయరని తెలిపారు. కేశినేని నాని ఇక్కడివరకు పరిమితమైతే.. పశ్చిమ సీటు వివాదం ముగిసిపోయేది. కానీ విజయవాడ వెస్ట్ నుంచి బేగ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు. బేగ్ లాంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యే అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల యువగళం యాత్ర ముగింపు సందర్భంగా బేగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
తనకు సన్నిహితుడైన బేగ్‌కు విజయవాడ వెస్ట్ సీటు ఇప్పించుకోవాలని కేశినేని నాని ప్రయత్నిస్తుంటే.. పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం కూడా ఈ విషయంలో చాలా అలర్ట్‌గా ఉంది. విజయవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు కేటాయిస్తే నాగుల్ మీరాకు దక్కుతుందని.. బీసీలకు ఇస్తే బుద్దా వెంకన్న బరిలో ఉంటారని నాగుల్ మీరా గతంలోనే తేల్చిచెప్పారు. విజయవాడ వెస్ట్ సీటు ఎవరికి దక్కుతుందనే విషయం చంద్రబాబు తేలుస్తారని ఈ సీటు రేసులో ఉన్న పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సీటు తాము ఆశిస్తున్నామని.. కానీ చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు.
ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. విజయవాడ వెస్ట్ పంచాయతీ మరింత ముదిరే అవకాశం ఉందని బెజవాడ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు.. పశ్చిమ సీటులో కొనసాగుతున్న పంచాయతీకి ఏ రకంగా ముగింపు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..