Andhra Pradesh: చిట్టీల పేరుతో ఘరనా మోసం.. రాత్రికి రాత్రే రూ. రెండు కోట్లతో జంప్‌

వాయిదాల పద్ధతిలో సామాన్లు తీసుకుంటున్న తన కస్టమర్లను చిట్టీల వైపు మళ్లించాడు. అలా మొదట పదిమందితో ప్రారంభమైన చిట్టీల వ్యాపారం సుమారు వంద మందికి పైగా చేరింది. మొదట్లో కొన్నాళ్లు తన వద్ద చిట్టీలు వేసిన కస్టమర్లకు మంచి లాభాలు ఇవ్వడంతో పాటు, సమయానికి డబ్బులు అందిస్తూ నిజాయితీపరుడిలా నటించాడు. చిట్టీలు కట్టే కస్టమర్స్ కు సైతం...

Andhra Pradesh: చిట్టీల పేరుతో ఘరనా మోసం.. రాత్రికి రాత్రే రూ. రెండు కోట్లతో జంప్‌
Chit Fund Fraud
Follow us
G Koteswara Rao

| Edited By: Narender Vaitla

Updated on: Jul 31, 2024 | 10:03 AM

విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కత్తెర వెంకటరావు అనే వ్యక్తి సుమారు వందమంది నుండి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టి రాత్రికి రాత్రే ఉడాయించాడు. చిట్టీల నిర్వాహకుడు వెంకటరావు గత కొన్ని ఏళ్లుగా కూలీలు, చిరు వ్యాపారులే లక్ష్యంగా ప్లాన్ చేసుకున్నాడు. వెంకటరావు మొదట్లో ఇంటింటికి తిరిగి వారికి కావలసిన సామానులను వాయిదాల పద్ధతిలో ఇస్తూ వ్యాపారం చేసేవాడు. అలా కొన్నాళ్ల తరువాత అతనికి పరిచయమైన కస్టమర్స్ తో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు.

వాయిదాల పద్ధతిలో సామాన్లు తీసుకుంటున్న తన కస్టమర్లను చిట్టీల వైపు మళ్లించాడు. అలా మొదట పదిమందితో ప్రారంభమైన చిట్టీల వ్యాపారం సుమారు వంద మందికి పైగా చేరింది. మొదట్లో కొన్నాళ్లు తన వద్ద చిట్టీలు వేసిన కస్టమర్లకు మంచి లాభాలు ఇవ్వడంతో పాటు, సమయానికి డబ్బులు అందిస్తూ నిజాయితీపరుడిలా నటించాడు. చిట్టీలు కట్టే కస్టమర్స్ కు సైతం మంచి లాభాలే వచ్చాయి. అలా అతనిని నమ్మి కస్టమర్స్ కూడా పెరగడంతో తన అసలు రూపం బయటికి తీశాడు. 15 మంది సభ్యులు ఉండాల్సిన చిట్టీలో ఒకరికి తెలియకుండా ఒకరిని యాభై మంది వరకు సభ్యులను చేసేవాడు.

ఎవరికి వారే పదిహేను మంది సభ్యులే అనుకున్నారు. వారిలో ఒకరికి ఒకరు పరిచయం కాకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. చిట్టీ పాట కూడా ఫోన్ కాన్ఫరెన్స్ లోనే పెట్టేవాడు. ఒకరి మొహం ఒకరికి తెలియక పోవడంతో చిట్టీ సభ్యుల మాదిరిగా వెంకట్రావు తన సొంత మనుషులతో అధిక లాభాలు వచ్చేలా పాడించి ఏ ఒక్కరికి చిట్టీ దక్కకుండా ప్లాన్ చేసుకున్నాడు. పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయనుకొని ఎవరికి వారే ఆనందంగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఎవరైనా సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ నష్టానికి చిట్టీ పాడుకుంటే వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి నిర్వాహకుడు వెంకట్రావే తీసుకునేవాడు.

మరికొందరు సభ్యులు పాడుకోవడానికి ప్రయత్నిస్తే తన సొంత మనుషులతో అధిక లాభం వచ్చేలా రేటు పెంచి చిట్టీ వారికి రాకుండా చేసేవాడు. అలా అనేక రకాలుగా మోసాలకు పాల్పడ్డాడు. ఒకరికి ఒకరు పరిచయం లేకపోవడంతో భాదితులు ఎంత మంది ఉన్నారో? ఎవరికి డబ్బులు ఇస్తున్నారో? ఎవరికి డబ్బులు ఇవ్వలేదో? ఏ ఒక్కరికీ తెలియదు. వీరిలో కొంతమంది అవసరానికి పాడుకున్న చిట్టీ డబ్బు ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో చివరికి వెంకటరావును నిలదీశారు.

దీంతో అసలు భాగోతం బయటపడుతుందని గమనించిన వెంకట్రావు ఈ నెల 18 రాత్రి ఇంట్లో సామానులు తీసుకొని, భార్యాపిల్లలతో పరారయ్యాడు. ఆ మరుసటి రోజు డబ్బు కోసం వెళ్లిన పలువురు కస్టమర్లు ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఖంగుతిన్నారు. తరువాత కొద్ది రోజులకు భాదితులంతా ఒక్కరొక్కరిగా బయటకు వచ్చి జరిగిన మోసం తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు అందిన వివరాల ప్రకారం సుమారు వంద మందికి పైగానే భాదితుల వద్ద దాదాపు రెండున్నర కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తుంది. జరిగిన ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..