
తెలంగాణ మంత్రి హరీశ్ రావు వర్సెస్ ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించడం.. ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కింది. ఏపీపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోయారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాలకులు వేరు.. ప్రజలు వేరు. నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదు. ఇది తెలంగాణ నాయకులు, ఏపీ మంత్రులకు కూడా వర్తిస్తుందంటూ పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు ఏ సందర్భంలో ఏపీపై మాట్లాడోగారో కానీ.. ఆ తర్వాత వైసీపీ మంత్రలు నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదని.. ఆత్మగౌరవం దెబ్బ తినేలా వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడడం తనకు మనస్థాపం కలిగించిందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే, పవన్ వ్యాఖ్యలు ఏపీతోపాటు తెలంగాణలో సైతం చర్చనీయాంశంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు స్పందించారు. తెలంగాణను, తెలంగాణ ప్రజలను తక్కువ చేసేలా తమ మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అడపా శేషు అన్నారు. ఏపీ మంత్రులనుద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పవన్ కల్యాణే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీలో అభివృద్ధి గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడితే దానికి సమాధానంగా తెలంగాణలో పరిస్థితి గురించి ఏపీ మంత్రులు మాట్లాడారని అన్నారు. ఏపీ మంత్రులనుద్దేశించిన చెప్పిన మాటలను వెనక్కి తీసుకొని ఏపీ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని శేషు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఒక వ్యాపార సంస్థగా విమర్శించారు. వారానికో, పదిరోజులకోసారి రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి పోవడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఇక్కడి ప్రజలు ప్రజలుగా కనిపించడం లేదా అని పవన్‌ను ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..