కాకినాడలో కలకలం.. రంగరాయ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్‌పై ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి..
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ స్పోర్ట్స్ వైస్ ఛైర్మన్‌పై ఎమ్మెల్యే దాడి చేయడంపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ ఛైర్మన్‌పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం కలకలం రేపింది. ఓ వివాదంలో కాలేజీకి వెళ్లిన ఎమ్మెల్యే కాలేజీ స్పోర్ట్స్ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. వెళ్తూనే ఆయన్ను బూతులు తిడుతూ, మాస్క్‌ని లాగి ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే వెంట జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు.
రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరారు ఎమ్మెల్యే పంతం నానాజీ. దీనిపై ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాలేజీ అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు క్రీడాకారులు నెట్ కడుతుండగా, పర్మిషన్ వచ్చాక అనుమతి ఇస్తామని తెలిపారు కాలేజీ స్పోర్ట్స్ వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరరావు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి క్రీడాకారులు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో వచ్చిన ఎమ్మెల్యే, ఉమామహేశ్వరరావును బూతులు తిడుతూ దాడి చేశారు.
ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం. వెంటనే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ, కలెక్టర్ .. ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ఇవాళ్టి నుంచి నిరసనకు దిగుతామంటున్నారు దాడికి గురైన ఉమామహేశ్వరరావు. తమ విద్యార్థులు ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపేస్తామని చెబితే తానే వద్దన్నానని చెబుతున్నారు.
మరోవైపు దళిత సంఘాలు నేతలు, ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. ఒక దళిత అధికారిపై కావాలనే దాడి చేశారని, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోయినా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు రంగరాయ మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. కాలేజీలోకి వచ్చి మరీ అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెబుతారా? లేక రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. అటు ఉమామహేశ్వరరావుపై జరిగిన దాడిని దళిత సంఘాల నేతలు ఖండిస్తున్నాయి. ఇది దళితుల మీద జరిగిన దాడి అని మండిపడుతున్నారు. దీనివల్ల ఈ గొడవ మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..