CTET 2024 Exam Postponed: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్ష వాయిదా.. కారణం ఇదే!
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీబీఎస్‌ఈ అధికారిక ప్రటనను విడుదల చేసింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 1వ తేదీన పరీక్ష రాయవల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ పరీక్షను వాయిదా వేసిన సీబీఎస్ఈ డిసెంబర్ 15వ తేదీన (ఆదివారం) పరీక్షను నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది..
హైదరాబాద్, సెప్టెంబర్ 22: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీబీఎస్‌ఈ అధికారిక ప్రటనను విడుదల చేసింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 1వ తేదీన పరీక్ష రాయవల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ పరీక్షను వాయిదా వేసిన సీబీఎస్ఈ డిసెంబర్ 15వ తేదీన (ఆదివారం) పరీక్షను నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఆఫ్‌లైన్ విధానంలో ఓఎమ్మార్ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరిపాలనా కారణాలతో పరీక్ష నిర్వహణ తేదీని రీషెడ్యూల్ చేసినట్లు సీబీఎస్సీ వెల్లడించింది. దరఖాస్తు తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదని పేర్కొంది. కాగా ఇప్పటికే సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. దరఖాస్తు సవరణకు సెప్టెంబర్ 25, 2024వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
కాగా సీటెట్ పరీక్ష ప్రతీ యేట రెండుసార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తారు. రెండో పేపర్ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. పరీక్షను దేశ వ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
జాబ్ క్యాలెండర్ షెడ్యూలు ప్రకారం పరీక్షల.. టీజీపీఎస్సీకి సహకరించాలంటూ ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వేగంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టుల నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వివిధ విభాగాల నుంచి పూర్తిస్థాయి సహకారం అందించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఒక్కో విభాగం నిర్వహించాల్సిన బాధ్యతలను స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసు, గురుకుల, విద్యుత్తు, సింగరేణి, వైద్యారోగ్యశాఖ నియామకాలకు సొంత బోర్డులు ఉండటంతో భర్తీకి వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే టీజీపీఎస్సీకి మాత్రం వివిధ ప్రభుత్వ విభాగాల సహకారం కీలకంగా మారింది. మరోవైపు కమిషన్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువ ఉండటంతో గడువులోగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించి, నియామకాలు పూర్తి చేయాలంటే అన్ని విభాగాల సహకారం అవసరమని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆయా శాఖలు, విద్యాసంస్థలు, జిల్లా కలెక్టర్లు టీజీపీఎస్సీకి పూర్తి మద్దతు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే పరీక్షల కేంద్రాల గుర్తింపు, పరీక్షల నిర్వహణకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి, జేఎన్‌టీయూ, ఓయూ, పీఎస్‌టీయూ, బీఆర్‌ఏవోయూ, ఎస్‌సీఈఆర్‌టీ, సంక్షేమ, క్రీడా, పోలీసుశాఖలు, డైరెక్టర్ మీసేవ, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, కలెక్టర్లు, పరిపాలన యంత్రాంగానికి బాధ్యతలు కేటాయించింది.