Dating App Scam: మహానగరంలో హై’టెకీ’ మోసం.. డేటింగ్‌ యాప్‌ల్లో అమ్మాయిలా నటిస్తూ NRIలకు టోకరా!

ఉద్యోగం పోయిందని మోసాల బాట పట్టాడో టెకీ. అదీ ఆర్థిక నగరం బెంగళూరులో. అక్కడ ఓ ఖరీదైన విల్లాలో నెలకు రూ.75 వేల అద్దె చెల్లిస్తూ, విలాస వంతమైన కార్లలో షికార్లు చేస్తున్నాడు. ఉద్యోగం లేకపోయినా ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడా? అని అందరూ నోరెళ్ల బెట్టారు. ఆనక అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు. కూర్చున్న చోటు నుంచే తన మాస్టర్‌ మైండ్‌తో మోసాలకు పాల్పడుతూ అధిక మొత్తంలో..

Dating App Scam: మహానగరంలో హై'టెకీ' మోసం.. డేటింగ్‌ యాప్‌ల్లో అమ్మాయిలా నటిస్తూ NRIలకు టోకరా!
Dating App Scam
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2024 | 9:04 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20: ఉద్యోగం పోయిందని మోసాల బాట పట్టాడో టెకీ. అదీ ఆర్థిక నగరం బెంగళూరులో. అక్కడ ఓ ఖరీదైన విల్లాలో నెలకు రూ.75 వేల అద్దె చెల్లిస్తూ, విలాస వంతమైన కార్లలో షికార్లు చేస్తున్నాడు. ఉద్యోగం లేకపోయినా ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడా? అని అందరూ నోరెళ్ల బెట్టారు. ఆనక అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు. కూర్చున్న చోటు నుంచే తన మాస్టర్‌ మైండ్‌తో మోసాలకు పాల్పడుతూ అధిక మొత్తంలో డబ్బు గుంజుతున్నాడు. డేటింగ్‌ యాప్‌ల్లో అమ్మాయిలా నటిస్తూ అవతలి వ్యక్తుల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు వసూలుచేయడమే మనోడి పని. డేటింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా అమెరికన్లు, ప్రవాస భారతీయుల్ని మోసగిస్తున్న ఈ హైటెక్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్‌క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌ ప్రాంతానికి చెందిన రిద్‌ బేడి (26) అనే వ్యక్తి అమెరికాలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌గా ఉద్యోగం చేసేవాడు. ఆరేళ్ల తర్వాత సదరు యూఎస్‌ కంపెనీ రిద్‌ బేడీని ఉద్యోగంలో నుంచి పీకేసింది. రోల్‌ప్లేయింగ్‌ గేమ్స్‌ అనే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి బెంగళూరుకు వచ్చిన రిద్‌ ఓ ప్రైవేట్ సంస్థలో ప్రొడక్ట్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతానికి అతడు గడిపే విలాస జీవితానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండేది. దీంతో చుట్టూ అందరూ రిద్ను చూసి తెగ ఆశ్చర్యపోయేవారు. నిజానికి, అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన తర్వాత రిద్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వీటి నుంచి గట్టెక్కడానికి నేరావతారం ఎత్తాడు. డేటింగ్‌ వెబ్‌సైట్ల నుంచి అర్ధనగ్నంగా ఉన్న అందమైన యువతుల ఫొటోలు సేకరించి.. వాటితో నకిలీ ప్రొఫైళ్లు తయారుచేశాడు.

ఇండియాలోని వారైతే పోలీసులు పట్టుకుంటారనే భయంతో.. విదేశాల్లో ఉన్న ఇండియన్స్‌, అమెరికన్లు లక్ష్యంగా నేరాలకు పాల్పడేవాడు. అక్కడి పురుషులతో తాను అమ్మాయిగా పరిచయం చేసుకుని చాటింగ్‌ చేసేవాడు. పగలంతా నిద్రిస్తూ.. రాత్రిళ్లు మేల్కొని చాటింగ్‌లో వారిని ముగ్గులోకి దింపి, అర్ధనగ్న ఫొటోలను వారికి పంపుతాడు. అలాగే వారి వ్యక్తిగత చిత్రాలూ సేకరించేవాడు. ఆ తర్వాత బెదిరింపులకు తెగబడేవాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఫొటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగేవాడు. అలా వారి నుంచి అందిన కాడికి గుంజుకునేవాడు. డబ్బు నేరుగా తన బ్యాంకు అకౌంట్‌లో జమ అయితే తన గుర్తింపు బయటకు వస్తుందని భావించిన రిద్.. జెల్లీ యాప్, వెబ్‌సైట్‌ ద్వారా వారిని నగదు పంపాలని సూచించేవాడు. అక్కడినుంచి తన ఖాతాలకు బదిలీ చేసుకుంటాడు.

ఇవి కూడా చదవండి

తాజాగా అమెరికాలో ఉండే ఓ హైదరాబాదీ యువకుడిని ఇలాగే మోసగించి 1,721 డాలర్లు (రూ.1,43,975) వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో హైదరాబాద్‌లోని తన తండ్రికి విషయం చెప్పాడు. ఆయన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్‌ పి ప్రమోద్‌కుమార్‌ బెంగళూరు నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నట్లు గుర్తించారు. అక్కడి వెళ్లిన పోలీసులు రిద్‌ మోసాలు చూసి విస్తుపోయారు. అయని వద్ద నుంచి నకిలీ సిమ్‌కార్డులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.