Vegetables Price: సామాన్యుడి నెత్తిన పిడుగు.. భారీగా పెరిగిన కూరగాయలు, బియ్యం, నూనె ధరలు!

పండగల సీజన్‌ మొదలైనప్పటి నుంచి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం.. ఒక్కటేమిటీ దేనిని పట్టుకున్నా షాక్‌ కొట్టేలా ఉంది పరిస్థితి. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు ఇతర ఖర్చులకు అరకొర సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతుంది. ఇక దినసరి కూలీ సంగతి సరేసరి..

Vegetables Price: సామాన్యుడి నెత్తిన పిడుగు.. భారీగా పెరిగిన కూరగాయలు, బియ్యం, నూనె ధరలు!
Vegetables Price
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2024 | 11:02 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20: పండగల సీజన్‌ మొదలైనప్పటి నుంచి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం.. ఒక్కటేమిటీ దేనిని పట్టుకున్నా షాక్‌ కొట్టేలా ఉంది పరిస్థితి. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు ఇతర ఖర్చులకు అరకొర సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతుంది. ఇక దినసరి కూలీ సంగతి సరేసరి. నిత్యావసర సరుకులు పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సమాన్యుడు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

గత కొంతకాలంగా పెరిగిన ధరలు, ఇతర వ్యయాలతో కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతుంది. ఇంటి కిరాయిలు, పాలు, చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల పెరిగిన ధరలతో సామాన్యుల నోట మాట రావడం లేదు. ప్రస్తుతం లీటరు నూనె ప్యాకెట్‌పై ఏకంగా రూ.15 నుంచి రూ. 20 పెరిగింది. బియ్యం ధరలు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 పెరిగాయి. పెరిగిన ధరల దృష్ట్యా వ్యాపారులు ఇదే అదునుగా మరింత రేట్లు పెంచుతున్నారు. ఇక పప్పుల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. తాజాగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాపారస్తులపై నియంత్రణ లేకపోవడంతో మార్కెట్‌లోకి నాణ్యమైన బియ్యం పేరిట స్టీమ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్‌ షాపుల నుంచి తీసుకువచ్చిన బియ్యాన్ని పాలిష్‌ చేసి మార్కెట్‌లో వదులుతున్నారు. ఈ దందా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో జోరుగా సాగుతుంది.

ఇక కూరగాయల విషయానికొస్తే.. బెండకాయ, కాకర, బీరకాయ, బిన్నీస్, గోకరకాయ, క్యాప్సికం ధరలు బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100 చొప్పున ధర పలుకుతుంది. ఉల్లి ధర బహిరంగమార్కెట్‌లో రూ.60లు కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. వెల్లుల్లి కేజీ రూ.450, అల్లం కేజీ రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. మూడు రోజుల క్రితం వరకు రైతుబజార్లలో రూ.20 కేజీ ఉన్న టమాటా రిటైల్‌ ధర ఇప్పుడు రూ.45గా నిర్ణయించగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.60కి విక్రయిస్తున్నారు. మెహిదీపట్నం, ఫలక్‌నుమా, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, అల్వాల్, రామక్రిష్ణాపురం, సరూర్‌నగర్, వనస్థలిపురం కూరగాయల మార్కెట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.