Red Smugglers Arrested: పుష్ప స్టైల్ కంటీన్యూ.. గోపవరంలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు..
సినిమాలు చూసి స్మగర్లు నేర్చుకుంటున్నారో.. లేదంటే, జరుగుతున్న స్మగ్లింగ్ ఆధారాలతోనే సినిమాలు తీస్తున్నారో తెలియదు గానీ, సినీఫక్కీలో రెడ్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.
Red Smugglers Arrested: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు అధికారులకు విస్మయాన్ని కలిగిస్తోంది. సినిమాలు చూసి స్మగర్లు నేర్చుకుంటున్నారో.. లేదంటే, జరుగుతున్న స్మగ్లింగ్ ఆధారాలతోనే సినిమాలు తీస్తున్నారో తెలియదు గానీ, సినీఫక్కీలో రెడ్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లర్లు గుట్టుగా తమ పని సాగిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుండి పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో బద్వేలు రూరల్ సీఐ హనుమంత్‌నాయక్ తన ఇన్ఫార్మర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ద్వారా సిబ్బంది స్మగ్లర్లపై నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు తెలిపారు.
అరెస్టు అయిన వారిలో గాలి బోయిన జయన్న, మనీమల్‌కొండయ్య, ఆరవ సురేంద్ర, గోపురం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గువ్వల శివయ్య, ఖాజీపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటయ్యలు ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 725 కేజీల బరువు గల 26 ఎర్రచందనం స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. అనంతరం స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కృషి చేసిన సిబ్బందిని రివార్డులతో ఎస్పీ అభినందించారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి