Nagababu: ప్రజల కష్టార్జితాన్నిదోచుకుంటోన్న వైసీపీని సాగనంపాల్సిన సమయమొచ్చింది: జనసేన నేత నాగబాబు
Nagababu: ఇటీవల ఏపీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్, జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు. తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. కేంద్రం మంజూరుచేసిన 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై నాగబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు
Nagababu: ఇటీవల ఏపీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్, జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు. తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. కేంద్రం మంజూరుచేసిన 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై నాగబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల మళ్లింపు, టీటీడీ వ్యవహారాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోంచి సొమ్మును తీసుకోవడంపై సాంకేతిక లోపం అని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 12, 918 గ్రామ పంచాయతీల్లోని నిధులను ఊడ్చేయడాన్ని ఏమంటారో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15 వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ అవసరాలు, పిల్లల చదువులు, గృహ నిర్మాణాలు, వైద్య ఖర్చులు, భవిష్యత్ అవసరాల కోసం నెలవారీ జీతంలో కొంత సొమ్మును పొదుపు చేసుకుంటోన్న ఉద్యోగుల కష్టార్జితం రూ. 800 కోట్ల జీపీఎఫ్ నిధులను మళ్లించిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన నేత అభిప్రాయపడ్డారు.
జగన్ రెడ్డి మార్కు పాలన ఇది..
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రూ.8 లక్షల కోట్ల రుణ భారాన్ని ఈ ప్రభుత్వం మోపింది. సర్పంచుల చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా దోచుకోవడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట. ఒక్క రూపాయి ఉత్పాదన గురించి ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ స్థలాలను విక్రయించడం, అడ్డూ అదుపూ లేకుండా పన్నులు వసూలు చేయడం, ప్రభుత్వ ఖజానాలోని ప్రతి పైసాను దారి మళ్లిస్తోన్న జగన్ రెడ్డి మార్కు పాలనను ప్రజలు గమనిస్తున్నారు. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అంధకారమవుతుంది. ఈప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పిలుపునిచ్చారు నాగబాబు.
రిఫండబుల్ డిపాజిట్లు ఏం చేస్తున్నారు?
ఇక ఏపీకే తలమానికంగా భావిస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే భక్తుల నుంచి అద్దె గదుల కోసం వసూలు చేస్తోన్న రిఫండబుల్ డిపాజిట్లను ఏం చేస్తున్నారో టీటీడీ సమాధానం చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. ‘రిఫండబుల్ డిపాజిట్లలో అద్దె జమ చేసుకోగా మిగిలిన సొమ్మును తిరిగి భక్తులకు చెల్లించడం లేదు. అదేంటి అని అడిగితే బ్యాంకు ఖాతాలకు పంపిస్తామని చెబుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దేవడిపై భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తుల రిఫండబుల్ డిపాజిట్లలో అద్దెకు పోగా మిగతా సొమ్మును ఏం చేస్తున్నారో టీటీడీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు నాగబాబు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..