Janasena Leader Nadendla Manohar Comments: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలిస్తే అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తారా? అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ వైసీసీ విస్మరించిందన్న ఆయన.. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి నయవంచనకు పాల్పడిందని ఆరోపించారు. మోసపోయిన బాధితులకు జనసేన బాసటగా నిలిస్తే సీఎం ఇబ్బంది పడుతున్నారని మనోహర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ఆయా జిల్లాల ఉపాధి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని జనసేన చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు, జన సైనికులను నిన్న రాత్రి నుంచి గృహ నిర్భంధాల్లో ఉంచడం అప్రజాస్వామికం అని మనోహర్ అన్నారు.
‘‘ప్రజాస్వామ్యంలో వినతిపత్రాలు ఇవ్వడం పౌరులకు, వారి పక్షాన నిలిచేవారికి ఉన్న హక్కు. దీన్ని అడ్డుకోవడం కచ్చితంగా నియంతృత్వ పోకడే అవుతుంది. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేసి అమలు చేయమంటే ఇబ్బంది కలుగుతోందా?ప్రభుత్వం ఎంతగా కట్టడి చేసినా జనసేన పార్టీ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తుంది’’ అని మనోహర్ అన్నారు.
Janasena Leader Nadendla Manohar Hot Comments