Pawan Kalyan: పార్టీ నాయకులను విడుదల చేసేవరకు జనవాణి కార్యక్రమం వాయిదా.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..
మా పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటామని జనసేన అధ్యక్షుడు కె.పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఏం చేయాలో వైసీపీ చెబుతోందన్నారు. తన ఉత్తరాంధ్రా పర్యటన మూడు నెలల క్రితమే ఫిక్స్ అయిందన్నారు. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడం తమ..
మా పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటామని జనసేన అధ్యక్షుడు కె.పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఏం చేయాలో వైసీపీ చెబుతోందన్నారు. తన ఉత్తరాంధ్రా పర్యటన మూడు నెలల క్రితమే ఫిక్స్ అయిందన్నారు. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడం తమ పార్టీ లక్ష్యం కాదని చెప్పారు. విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీపై మండిపడ్డారు. వికేంద్రీకరణ పేరుతో బూతులు తిడుతున్నారని విమర్శించారు. ఏపీ పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్న వ్యక్తి కింద పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులు గర్జన పేరుతో నిరసనలు తెలియజేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో గర్జిస్తూ.. నిరసనలు తెలియజేస్తారన్నారు. పోలీసులను ఎదుర్కొనే సామర్థ్యం తమకు లేక కాదని, పోలీసులంటే గౌరవం ఉందన్నారు. ప్రభుత్వాన్ని నడిపేది పోలీసులు కాదని, కేవలం శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులు చూసుకోవాలన్నారు. తమకు ప్రత్యర్థి పార్టీలతో రాజకీయ వైర్యం తప్పితే.. పోలీసులతో తమకు ఎటువంటి వివాదం లేదన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు. సమాజంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వైసీపీ గుండాలకు భయపడేది లేదన్నారు. జనవాణి కార్యక్రమం జరగకూడదు అనేది వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రత్యర్థుల ఎత్తుగడలు ఎలా ఎదుర్కొవాలో తనకు తెలుసన్నారు. ఏదో తాత్కాలికంగా కొన్ని రోజుల కోసం రాజకీయం చేయడానికి తాము ఇక్కడ లేమని, దశాబ్ధాల తరబడి రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ ఉందన్నారు. వికేంద్రీకరణ గురించి మాట్లాడే వైసీపీ గతంలో పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేసి వాటికి నిధులు కేటాయించని ముఖ్యమంత్రి వికేంద్రీకరణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలి
అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తమ నాయకులను విడుదల చేయకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు చేయడాన్ని ఈ ప్రభుత్వం తప్పుగా పరిగణిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరక్షణను జనసేన పార్టీ కోరుకుంటుందని తెలిపారు. తమ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడంపై ప్రత్యక్ష్యంగా ఉద్యమిస్తామని, ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించుకోవాలన్నారు. తమ పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, తామ పార్టీ కార్యకర్తలు అంత పెద్ద తప్పు ఏమి చేశారన్నారు. పోలీసులు తమను రెచ్చగొడుతున్నారని, వారు ఆపద్ధతి మానుకోవాలన్నారు. పోలీసులు పార్టీల కోసం పనిచేయాలని సూచించారు. ఇతరుల పట్ల దురుసు ప్రవర్తన మానుకోవాలన్నారు. భవిష్యత్తుల్లో అన్నింటికి సమాధానం ఇస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఉత్తరాంధ్రాలో ఘర్షణలు కోరుకుంటున్నది వైసీపీనే: పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్రాలో ఘర్షణలు సృష్టించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ఉత్తరాంధ్రా పర్యటనకు వస్తే ప్రభుత్వ అక్రమాలు, భూకబ్జాలపై మాట్లాడతాననే ఉద్దేశంతోనే జనవాణి కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నించిందన్నారు. సైనికుల భూములకే ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదన్నారు. అన్యాక్రాంతమైన భూములను కాపాడి, సైనికులకు న్యాయం చేయాలన్నారు. వైసీపీ నాయకులు భయంతో ఉన్నారని విమర్శించారు. వైసీపీ అక్రమాలు చూసేందుకు, మాట్లాడేందుకు తన జీవితకాలం సరిపోదన్నారు.
అసలేం జరిగిందంటే
దాడులు, అరెస్టులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో విశాఖ తీరం దద్దరిల్లుతోంది. ఎయిర్‌పోర్టులో నిన్న మంత్రులు, వైసీపీ నాయకులపై జరిగిన దాడి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పొలిటికల్ గ్రౌండ్‌లో కాక రేపుతున్నాయి. ఇక రాత్రంతా అరెస్టుల పర్వం కొనసాగింది. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ పరిసరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దాడిలో పాల్గొన్న అభియోగాలపై పలువురు జనసైనికులను అదుపులోకి తీసుకున్నారు. జనసేన నేతలు సుందరపు విజయ్‌కుమర్, పివిఎస్ ఎన్ రాజుతో పాటు పలువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విశాఖలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎయిర్‌పోర్టులో మంత్రులు, వైసీపీ నాయకులపై నిన్న జరిగిన దాడులపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. మంత్రులపై హత్యాయత్నంతో పాటు.. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు బుక్ చేశారు. వాటిపై పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. పవన్‌కల్యాణ్ బస చేసిన హోటల్‌లో పలువురు జనసైనికులను అదుపులోకి తీసుకున్నారు. పాతిక మందిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..