Jagananna Vidya Deevena: చదువుతోనే రూపు రేఖలు మారుతాయి.. ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల
Jagananna Vidya Deevena scheme: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో అమల్లోకి తీసుకువచ్చిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం

Jagananna Vidya Deevena scheme: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో అమల్లోకి తీసుకువచ్చిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి విడత నగదును ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ రూ.671.45 కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో మొదటి విడత రియంబర్స్‌మెంట్ నగదును రాష్ట్ర వ్యాప్తంగా 10,88,439 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ ఫీజు రియంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నాలుగు విడతల్లో మంజూరు చేయనుంది. ప్రస్తుతం విద్యార్థులకు తొలి త్రైమాసికం బోధనా రుసుములను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘జగనన్న విద్యాదీవెన గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. చదువుతోనే జీవితాల రూపు రేఖలు మారతాయని.. పేదరికం నుంచి బయటపడతామంటూ వ్యాఖ్యానించారు. దీనిలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేస్తున్నామన్నారు. 2018-19 సంబంధించి రూ.1880 కోట్లు బకాయిలు చెల్లించామని.. 2019-20కి సంబంధించి రూ.4208 కోట్లు గతేడాది చెల్లించామని తెలిపారు. పిల్లల చదువులను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని.. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే విద్యాదీవెన నిధులను విడుదల చేస్తామి తెలిపారు. అర్హత ఉండి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోతే విద్యార్థులు 1902కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందంటూ తెలిపారు. కళాశాల యాజమాన్యాలలోనూ జవాబుదారీతనం పెరగగాలి.. అందులో భాగంగానే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఏటా నాలుగు విడతలుగా నగదును జమచేయనున్నారు. దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. దీనిద్వారా తల్లులు ఫీజులు చెల్లించేందుకు ఏటా నాలుగు సార్లు కళాశాలకు వెళ్తారని, అక్కడ సదుపాయాలు, బోధనా పద్ధతుల్ని పరిశీలించి యాజమాన్యాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో.. ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Jagananna Vidya Deevena
Also Read:
